ఈ ఆందోళ‌న‌ల వెన‌క ప్రశాంత్ కిషోర్‌

- ఎన్నిక‌ల కోసం వ్యూహ‌క‌ర్త‌ను పిలిపించుకున్న కేసీఆర్‌
- త‌న మార్కు సూచ‌న‌లు చేసిన ప్ర‌శాంత్‌కిషోర్‌\
-జిల్లాల్లో ఆందోళ‌న‌లతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న టీఆర్ఎస్

ప్రశాంత్ కిషోర్… రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. దేశ రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పేరు సంపాదించారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయం కోసం ఆయన పని చేశారు. ఆయన టీమ్ తో కలిసి పని చేస్తే కచ్చితంగా అధికారంలోకి రావొచ్చని పార్టీలు నమ్ముతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఎంతటి ప్రతికూల ప్రభావాలు ఉన్నా తనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీని గెలిపించడం కోసం పీకే ఏమైనా చేస్తారని టాక్.

ఇప్పుడు తెలంగాణలో పీకే మార్కు రాజకీయం నడుస్తోందా…? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముచ్చటగా మూడోసారి గెలవాలనే పంతంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించారు. దీంతో ఆయన తన పని ప్రారంభించినట్లు సమాచారం. మొదటగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు. ఇక ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు..? అనే విషయంలో ఈ సర్వే కొనసాగింది. ఈ సర్వేలో సంతృప్తికర నివేదిక రాలేదని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలి… ఎలా చేయాలి అనే దానిపై ఆయన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందచేసినట్లు సమాచారం.

ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లాల్లో నేతలను పిలిపించుకుని మాట్లాడారు. ఎవరెవరు నేతల పనితీరు ఎలా ఉంది… వారు చేయాల్సిన పని ఏమిటనే దానిపై దిశానిర్దేశం చేశారు. అదే సమయయంలో స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. అది కూడా కేంద్ర వైఫల్యం చెందిన సమస్యలపై ఆందోళనలను నిర్వహించాలని నేతలకు హితబోధ చేశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అదే కొనసాగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు సీసీఐ, ఇటు సింగరేణిపై దృష్టి సారించిన టీఆర్ఎస్ ఆందోళనలు సాగిస్తోంది. ఒకదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ముందుకు సాగుతోంది. తెలంగాణ బలపడుతున్న బీజేపీని దెబ్బకొట్టడం, సమస్యలపై స్పందిస్తున్న పార్టీగా ప్రజలకు చేరువ కావడం ఇది టీఆర్ఎస్ వ్యూహం. వరంగల్ జిల్లాలో సైతం రైల్వే కోచ్ ఫాక్టరీ ఏర్పాటు విషయమై కేంద్రాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతోంది. ఇక్కడ కూడా ఆ పార్టీ చాలా తెలివిగా ముందుకు వెళ్తోంది. తాను సొంతంగా పోరాటం చేసినట్లు కాకుండా మిగతా పక్షాలను సైతం వెంట తీసుకువెళ్తోంది. ఇక్కడ పోరాటం అందరిదీ… కానీ పేరు మాత్రం టీఆర్ఎస్కు దక్కుతోంది.

సమాజంలో ఏ అంశానికి కూడా వందశాతం అనుకూలత ఉండదు. దీనినే ద్వారానే సమాజంలో చీలికలు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని పీకే ప్లాన్ చేస్తుంటారు. ఈ ఫార్మూలానే ప్రస్తుతం తెలంగాణలో పీకే టీం అమల్లోకి తీసుకొస్తోంది. పీకే సలహాలతోనే సీఎం కేసీఆర్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది. ఇదంతా పీకే వ్యూహంలో భాగమనేని, రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా మరిన్ని అలజడులు ఖాయమనే ప్రచారం జరుగుతోంది

Get real time updates directly on you device, subscribe now.

You might also like