తెలంగాణ ప్రభుత్వ విజయం..

వేల కోట్ల విలువైన భూముల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం విజ‌యం సాధించింది. సుప్రీంకోర్టులో ఎన్నో ఏండ్లుగా కొన‌సాగుతున్న వివాదానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. మణికొండ జాగీర్ భూముల కేసులో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రూ.వేల కోట్ల విలువైన 1654 ఎకరాలు భూములపై ప్రభుత్వానికి హక్కు దక్కింది. మణికొండ జాగీర్ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య దాదాపు 15 ఏండ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ అంశం 2016లో సుప్రీంకోర్టుకు చేరగా.. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ భూములపై పూర్తిహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తెలంగాణ సర్కార్ ఓడిపోతే వక్ఫ్ బోర్డుకు ఏకంగా రూ.50 వేల కోట్లు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చేది.

దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అనే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ వక్ఫ్ బోర్డు 2006లో జారీచేసిన నోటిఫికేషన్ వివాదంగా మారింది. అయితే అక్కడ కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే దర్గాకు ఉందని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ భూముల్లో కొంత భాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 2001లో ISBకి, 2004 తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్ సహా ఇతర సంస్థలకు కేటాయించారు. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం.. ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీల కోసం కొన్ని భూములను విక్రయించగా, మ‌రికొన్నింటిని ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించింది.

అయితే ఆ భూములు దర్గాకు చెందినవేనని వక్ఫ్ బోర్డు పేర్కొంది. దీంతో ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు మధ్య హైకోర్టులో వాదనలు నడిచాయి. ఈ క్రమంలోనే హైకోర్టు వక్ఫ్‌ బోర్డు‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ కాలంపాటు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ భూములపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తాజాగా తీర్పు వెలువరించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like