మహబుబాబాద్‌లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్

YS Sharmila: ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మహబుబాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి రద్దు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు.

వైఎఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబుబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిలను అరెస్టు చేశారు. ఈ మేరకు నోటీసులు అందజేసిన పోలీసులు.. అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. శంకర్ నాయక్ తనపై, తన పార్టీ సభ్యులపై అవమానకరమైన చేస్తున్నారని మండిపడ్డారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. తాటాకు చప్పుళ్లకు ఈ వైఎస్సార్ బిడ్డ భయపడేది కాదని షర్మిల మండిపడ్డారు.

‘ఎవరినీ సెటిలర్లు, వలసదారులు అని పిలవవద్దని హెచ్చరిస్తున్నా. శంకర్ నాయక్ భార్య నెల్లూరుకు చెందినవారు. తెలంగాణపై ప్రేమ ఉంటే ఆమెకు విడాకులు ఇవ్వు. ఓ మహిళా ఐఏఎస్ అధికారితో అనుచితంగా ప్రవర్తించావు. అప్పుడే నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలి. లంచం ఆరోపణలతో నువ్వు ఉద్యోగం కోల్పోయావ్‌. ప్రతి స్కామ్‌లో ఉన్నావు. పేదరైతులు, గిరిజ‌నుల‌ భూములు లాక్కున్నావు. మీ పాపాల జాబితా అంతులేనిది. మీరు ఎమ్మెల్యే పదవికి సరిపోతారని కేసీఆర్ భావించడం సిగ్గుచేట’ని షర్మిల ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉద‌యం షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. షర్మిల క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పాదయాత్రను రద్దు చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు షర్మిలకు నోటీసులు అందజేసి.. ఆమె పాదయాత్రకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బీఆర్ఎస్ శ్రేణుల ఫిర్యాదుతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like