న్యాయస్థానం మెట్లెక్కిన ఆరిజ‌న్ వ్య‌వ‌హారం

-హైకోర్టు ఆశ్ర‌యించిన డైరీ నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ‌
-పోలీసులు, ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను ప్ర‌తివాదులుగా చేరుస్తూ పిటిష‌న్‌
-ఎమ్మెల్యే త‌మ‌ను మోసం చేసి వేధిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌
-పోలీసులు ఎమ్మెల్యేకు వంత పాడుతున్నార‌ని, మాన‌సిక వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న‌
-రేపు న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు రానున్న కేసు

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌మ‌ను వేధిస్తున్నాడ‌ని, పోలీసులు సైతం ఆయ‌న‌కే వంత పాడుతున్నార‌ని ఆరోపిస్తూ లేఖ‌లు, వీడియోలు విడుద‌ల చేసిన ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ చివ‌ర‌కు కోర్టు మెట్లెక్కారు. పోలీసులు, ఎమ్మెల్యే చిన్న‌య్య‌ను ప్ర‌తివాదులుగా చేరుస్తూ మంగ‌ళ‌వారం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హైకోర్టు లాయ‌ర్ ఎం.వెంక‌ట‌గుణ ఈ కేసును వాదిస్తుండ‌గా, రేపు (గురువారం) కేసు న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు రానుంది.

ఆరిజ‌న్ డైరీ వ్య‌వ‌హారం చివ‌ర‌కు న్యాయ‌స్థానం చెంత‌కు చేరింది. ఇందులో ఆరుగురిని ప్ర‌తివాదులుగా చేరుస్తూ ఆ డైరీ నిర్వాహ‌కుడు కందిమ‌ల్ల ఆదినారాయ‌ణ కోర్టులో కేసు న‌మోదు చేశారు. సైబ‌రాబాద్, రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్లు, మాదాపూర్‌, ల‌క్ష్సెట్టిపేట స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్లు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు. మాదాపూర్ పోలీసులు, ల‌క్ష్సెట్టిపేట పోలీసులు 41ఏ, సీఆర్‌పీసీ చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డంతో పాటు, గ‌తంలో ప‌లు మార్లు కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సైతం ధిక్కించార‌ని ఈ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

రైతుల‌కు రుణాలు ఇచ్చే ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిన ఆరిజ‌న్ డైరీ ఏర్పాటు చేశామ‌ని, బెల్లంప‌ల్లిలో ఈ డైరీ ఏర్పాటుకు, త‌మ వ్యాపార విస్త‌ర‌ణ‌కు భూమి అవ‌స‌రం అని ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను క‌లిసిన‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యే త‌న బంధువు అయిన తుడుం ప్ర‌కాష్ పేరుతో క‌న్నాల శివారులో ఉన్న రెండెకరాల భూమిని త‌మ‌కు అప్ప‌గించార‌ని దానికి రూ. 1 కోటి ఇవ్వ‌డంతో పాటు త‌మ కంపెనీలో 5 శాతం షేర్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. కోటి రూపాయల్లో తాము అడ్వాన్స్‌గా రూ. 30 ల‌క్ష‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య అక్క‌డ భూమి పూజ కూడా చేశార‌ని తెలిపారు. త‌ర్వాత త‌మ‌కు అప్ప‌గించిన భూమి ప్ర‌భుత్వ భూమి అని తెలియ‌డంతో ఎమ్మెల్యేను క‌లిసి త‌మ అడ్వాన్స్ త‌మ‌కు ఇచ్చేసి సేల్ డీడ్ క్యాన్సల్ చేయాల‌ని కోరిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే, ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌మ‌ను మీ అంతు చూస్తాన‌ని, మీరు తెలంగాణ‌లో తిర‌గ‌కుండా చేస్తాన‌ని బెదిరించాడ‌ని కోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. త‌మ‌పై దాడులు కూడా చేశార‌ని వెల్ల‌డిచారు.

దుర్గం చిన్న‌య్య త‌న ప‌ర‌ప‌తి ఉప‌యోగించి త‌మ‌పై పోలీసుల సాయంతో ఒకేరోజు ప‌ది కేసులు పెట్టించారని ఆదినారాయ‌ణ కోర్టుకు విన్నించారు. ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కురాలు బోడ‌పాటి షెజ‌ల్ సైతం అటు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, పోలీసులు వేధింపుల‌కు గురిచేశార‌ని తెలిపారు. వారి వేధింపుల‌తో మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన షెజ‌ల్ చివ‌ర‌కు ఆర్పిక్ తాగి ఆత్మ‌హ‌త్య‌య‌త్నంకు పాల్ప‌డింద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌పై పోలీసులు పెట్టిన కేసులు అబద్ద‌మ‌ని, నిరాధార‌మ‌ని వెల్ల‌డించారు. ఎమ్మెల్యే త‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డితో పోలీసుల ద్వారా వేధింపుల‌కు గురిచేస్తున్న నేప‌థ్యంలో కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. పోలీసులు 41 ఏ, సీఆర్‌పీసీ చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డంతో పాటు, గ‌తంలో ప‌లుమార్లు కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సైతం ధిక్కించార‌ని ఈ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో త‌మ‌కు న్యాయం చేయాల‌ని పోలీసుల వేధింపులు ఆపేలా చూడాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో చ‌ట్టాన్ని అతిక్ర‌మించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పిటిష‌న్‌తో పాటు ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కురాలు షెజ‌ల్ సైతం కోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు గురు, శుక్ర‌వారాల్లో మ‌రో పిటిష‌న్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలియవ‌చ్చింది. దీంతో ఈ కేసు ఏ మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like