‘నైరుతి’ రాక ఆల‌స్యం.. రైతులు తొందరపడొద్దు..

-ఆంధ్ర‌లో నెమ్మ‌దిగా క‌దులుతున్న రుతుప‌వ‌నాలు
-ఈ నెల 18న తెలంగాణ‌కు తాకే అవ‌కాశం
-అప్ప‌టి వ‌ర‌కు విత్తుకోవ‌ద్ద‌ని రైతుల‌ను కోరుతున్న అధికారులు

Monsoons :నైరుతి రుతపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. జూన్ మెుదటి వారంలోనే ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని తాకలేదు. నైరుతి రుతు ప‌వనాలు ఆల‌స్యం కావ‌డంతో అడ‌పాద‌డ‌పా కురిసే వ‌ర్షాల‌కు విత్త‌నాలు విత్తుకోవ‌ద్ద‌ని, రుతుపవనాలు వచ్చాకే విత్తుకోవాలని అధికారులు రైతుల‌కు సూచిస్తున్నారు. ఈ నెల 18 వ‌ర‌కు రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవ‌కాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

రెండు రోజుల కింద‌టే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవ‌కాశం ఉంది. ప్రస్తుతానికి రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. పుట్టపర్తి, శ్రీహరికోట వరకూ విస్తరించిన రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు. వచ్చే వారంరోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనుండగా ఈనెల 18వ లోపు తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరింతకొంత సమయం ప‌ట్ట‌నుంది.

రాయలసీమలో ప్రవేశించిన రుతుపవనాల కారణంగా తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఈనెల 18 నాటికి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల రాక ఆలస్యం కావటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like