సొంతింటి క‌ల నెర‌వేరుస్తం

-జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్

Balka Suman:జ‌ర్న‌లిస్టుల సొంతింటి క‌ల నెర‌వేర్చే బాధ్య‌త త‌మ‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంద‌న్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత గల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ కోసం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్నారు. సొసైటీ పేరిట ఖమ్మం, వరంగల్, హుజురాబాద్ జిల్లాలో ఇచ్చిన విధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా మొదటి అడుగు వేస్తున్నామని తెలిపారు.

మండల స్థాయి విలేకరులు ఆయా మండలాలలో తహసీల్దార్ల సమన్వయంతో స్థల ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కు పంపించాలని, వీటిని సీసీఎల్ఏకు పంపిస్తామ‌న్నారు. అక్కడి నుండి అధికారికంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిత్యం వార్తలతో సతమతమయ్యే జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. మారుమూల ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను తెరపైకి తీసుకువచ్చిన పరిష్కారం దిశగా అడుగు వేయడంలో అధికార యంత్రాంగానికి ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటు, ఇండ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత గల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like