అట్ట‌హాసంగా ప్రారంభమైన‌ జీ 20 సదస్సు

G20 Summit:జీ-20 సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. 20 దేశాల నాయకులకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘జీ-20 సదస్సు కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. కష్టకాలంలో మొరాకోకు వీలైన సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించారు. ఆదివారంతో ఈ సదస్సు ముగుస్తుంది. దీనికంటే ముందు అన్ని దేశాలతో కూడిన ఉమ్మడి డిక్లరేషన్ విడుదల కానుంది. సదస్సులో భాగంగా చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలకు ప్రకటనలో చోటు లభిస్తుంది. ఈ సదస్సుతో జీ-20కి భారత్ నాయకత్వం ముగుస్తుంది. భారత మండపంలోని స్వాగత వేదిక వద్ద ఒడిషాకు చెందిన కోణార్క్‌ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోణార్క్‌ చక్రం భ్రమణ చలనం, సమయంతో పాటు నిరంతర మార్పులను దేశాధినేతలు ఆసక్తిగా తిలకించారు.

జీ 20 ఎజెండా ఇదే..
జీ 20 సదస్సు లక్ష్యాలను, సదస్సు ఉద్దేశ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. ‘‘మానవీయత కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా’’ ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఉపయుక్తంగా జరుగుతాయని ఆకాంక్షించారు. 18వ జీ 20 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జీ 20 కి అధ్యక్షత చేపట్టిన సందర్భంగా.. భారత్ ప్రకటించిన జీ 20 థీమ్ అయిన ‘వసుదైక కుటుంబం’ భావనను ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు (One Earth, One Family, One Future)’’ అనే భావనను జీ 20 సదస్సు థీమ్ గా నిర్ధారించారు. భారత్ దృష్టిలో ప్రపంచమంటే ఇదేనన్నారు.

జీ 20 సదస్సులో..
G20 సదస్సులో ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు (One Earth, One Family, One Future)’’ సెషన్ కి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్ లో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికే దిశగా చర్చ కొనసాగుతుంది. అలాగే బలమైన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తారు. జీ 20 అధ్యక్షత పై ప్రధాన మోడీ స్పందిస్తూ.. ఇది నిర్ణయాత్మక, లక్ష్యపూరిత బాధ్యతగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, బహుముఖియ అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దికి అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. బహుముఖ అభివృద్ధికి టెక్నలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్నాయన్నారు. లింగ సమానత్వం దిశగా, మహిళల సాధికారత దిశగా, ప్రపంచ శాంతి దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సంక్షేమ, అభివృద్ధి పలాలు దక్కాలన్న మహాత్మా గాంధీ ఆలోచనల దిశగా కృషి సాగించాల్సి ఉందన్నారు. వివిధ దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like