18 లీట‌ర్ల పెట్రోల్‌.. ఐదుగురు వ్య‌క్తులు..

-తుది దశకు ఆరుగురి సజీవ దహనం కేసు విచారణ
-పోలీసుల విచారణలో వివ‌రాలు వెల్ల‌డించిన నిందితులు
-కొత్త యాప్‌లు వేసుకుని కాల్స్ చేసుకున్న నేర‌స్తులు
-పూర్తి స్థాయి వివ‌రాలు సేక‌రిస్తున్న ఖాకీలు

Manchiryal:మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురి సజీవ దహనానికి పాల్పడ్డ ఘ‌ట‌న‌లో పోలీసుల విచార‌ణ చివ‌రిద‌శ‌కు వ‌చ్చింది. మొద‌టి నుంచి కొంద‌రు వ్య‌క్తులు కావాల‌నే చేసిన ఘ‌ట‌న‌గా నిర్దార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తు చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ద‌హ‌నానికి పాల్ప‌డింది ఎవ‌రెవ‌రు..? ఈ ఘ‌ట‌న‌కు సూత్ర‌ధారులు మొత్తం ఎంత మంది..? ఘ‌ట‌న‌కు సంబంధించి మొత్తం వివ‌రాలు రాబ‌ట్టారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే పూర్తి స్థాయి స‌మాచారం సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

18 లీట‌ర్ల పెట్రోల్‌.. 5గురు వ్య‌క్తులు..
ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 18 లీట‌ర్ల పెట్రోల్ మొత్తం రెండు పెద్ద క్యాన్ల లో తెచ్చిన ట్టుగా గుర్తించారు. ఈ పెట్రోల్ ఇంటి పైన చుట్టూ పోసి తగలబెట్టినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకే పెద్ద ఎత్తున మంట‌లు లేచి ఎవ‌రూ బ‌య‌టికి రాలేక‌పోయిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మొద‌టి రోజే పోలీసులు 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన శాంతయ్య భార్య సృజన, ఆమె తండ్రితో పాటు లక్సెట్టి పేటకు చెందిన లక్ష్మణ్, రమేష్, గుడిపెళ్లికి చెందిన మరో వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు..
ఈ ఘ‌ట‌న‌కు పాల్పడ్డ నిందితులను కాసిపేట పోలీస్ స్టేషన్ లో విచారించిన రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అనంతరం సజీవ దహనం జరిగిన సంఘటన స్థలాన్ని డిసిపి అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రాథమిక విచారణలో హత్య నేరంగా పరిగణిస్తున్నామ‌ని, పూర్తి స్థాయి లో దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామ‌ని వెల్ల‌డించారు. పోలీసులు ఇద్దరు నిందితులను సంఘటన స్థలానికి తీసుకువచ్చి క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నించారు. మీడియాను చూసి వెనుదిరిగారు. సిఐ మీడియా ప్రతినిధులతో కవరేజ్ చేయద్దంటు తమ పని తమని చేయానీయాలంటు విజ్ఞప్తి చేశారు.

కొత్త యాప్‌లతో కాల్స్…
స‌జీవ ద‌హ‌నం ఘ‌ట‌న‌లో పాల్గొన్న నిందితులు కొత్త యాప్‌లు వేసుకుని మ‌రీ కాల్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టెక్నిక‌ల్‌గా పోలీసుల‌కు దొర‌క్క‌కుండా ఉండేందుకు వారు ఈ యాప్‌ల‌ను వాడిన‌ట్లు స‌మాచారం. అయితే పోలీసులు సైతం అదే స్థాయిలో ప‌క‌డ్బందీగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి పొర‌పాట్లు లేకుండా, అన్ని ఆధారాలు సేక‌రిస్తున్నారు. నిందితులు పెట్రోల్ ఎక్క‌డి నుంచి తెచ్చారు. గ‌తంలో రెండు సార్లు హ‌త్యాయ‌త్నం చేసిన వివ‌రాలు సైతం సేక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట‌న కావ‌డంతో దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టి ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like