ఆ తీర్పిచ్చిన జడ్జి సస్పెండ్..

Supreme Court: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు విషయంలో.. తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జస్టిస్ జయకుమార్ మీద సుప్రీంకోర్టు వేటు వేసింది. ఆయ‌న‌ను సస్పెండ్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఇచ్చిన తీర్పు తీవ్రంగా తప్పుబట్టింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ నమోదైన కేసులో విచారణ జరిపిన జడ్జి జస్టిస్ జయకుమార్‌ కీలక తీర్పు ఇచ్చారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ టాంపరింగ్ చేశారన్న ఆరోపణపై దాఖలైన పిటిషన్‌ మీద విచారించిన జడ్జ్ జయకుమార్‌.. శ్రీనివాస్‌ గౌడ్‌ సహా 10మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌ గౌడ్ మహాబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయగా.. అందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని అవి బయటకు రాకుండా అధికారులతో కలిసి శ్రీనివాస్ గౌడ్‌ తెర వెనుక వ్యవహరం నడిపారని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. పాత డాక్యుమెంట్‌ స్థానంలో కొత్తది అప్‌లోడ్ చేశారనేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్‌‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైదరాబాద్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జయకుమార్ ధర్మాసనం మంత్రితో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం కూడా వ్యక్తం చేసింది. దీంతో.. ఎట్టకేలకు మహబూబ్‌నగర్‌ రెండో టౌన్‌ స్టేషన్‌లో శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 10 మంది అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్ప‌టి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్, స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎవరైతే తప్పు చేశారో వారిని మాత్రమే నిందితులుగా చూడాలి తప్ప.. ఆ సమయంలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిందితులుగా పేర్కొనడం సరికాదని కోర్టుకు సీఈసీ విజ్ఞప్తి చేసింది. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ జయకుమార్ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం కోర్టు.. జడ్జిని సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like