నేత‌లు… బూతులు…

-కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వ‌ర్గ‌పోరు
-బూతులు తిట్టుకున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు
-ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ఎదురుగానే వాగ్వాదం

Congress:కాంగ్రెస్‌లో క‌ల‌హాలు కామ‌న్‌.. వ‌ర్గ‌పోరు లేకుండా, నేత‌లు గొడ‌వ‌లు పెట్టుకోకుండా దాదాపు ఏ స‌మావేశం ముగియ‌దు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ఎదురుగానే నేత‌లు బూతు పురాణంతో వాగ్వావాదానికి దిగారు. రెండు వ‌ర్గాల మధ్య తోపులాట జ‌ర‌గ్గా ఒక ద‌శ‌లో కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది.

కొమురం భీం జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్గపోరు తెరపైకి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అక్క‌డ టిక్కెట్ ఆశిస్తున్న నేత గణేష్ రాథోడ్ మ‌ధ్య వ‌ర్గ‌పోరు కొన‌సాగుతోంది. తాజాగా బుధ‌వారం అక్క‌డ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లు కొన‌సాగాయి. అనంత‌రం నాయకులు మాట్లాడుతుండగా ఒక వర్గం వారు వేదికపై ఎవరు పడితే వారు మాట్లాడటం సరికాదని చెప్పడంతో మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. మైక్ గుంజుకోవడతో గొడ‌వ ప్రారంభం అయింది. ఈ క్రమంలో రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. తోపులాట వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకున్నారు. కాగజ్ నగర్ కు చెందిన నాయకుడు రావి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతుల పురాణం మొదలుపెట్టారు.

నన్ను ఎందుకు ఇక్కడ పిలిచారని రావి శ్రీ‌నివాస్ సీరియ‌స్ అయ్యారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారంటే మేమేం చేయాలి అంటూ ఆగ్రహం తో ఊ గిపోయారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో గొడవలు జరుగుతుంటే సిర్పూర్ నియోజకవర్గంలో మా పరువు పోతోందని రావి శ్రీ‌నివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ఎదురుగానే జ‌ర‌గ‌డం గ‌మనార్హం. ఆయ‌న ఒక స‌మ‌యంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో గొడ‌వ కొన‌సాగింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like