మంత్రి నివాసం ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు..

ABVP: విద్యారంగ స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి కోరుతూ ABVP ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముట్టడించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా నిర్మల్ జిల్లా కన్వీనర్ శశి మాట్లాడుతూ… తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కారానికి లేద‌న్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ప్ర‌భుత్వం విద్య‌ను నిర్వీర్యం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. 15 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాల‌ర్‌షిప్‌ల‌ మీద ఆధారపడి చదువుతుంటే, నాలుగు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. దాదాపు 5,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఇప్పటికే సుమారు 8000 పాఠశాలు మూసివేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 525 మండలాలు ఉంటే 18 మంది మాత్రమే MEOలు ఉంటే ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ ఏ విధంగా జరుగుతుందని ప్ర‌శ్నించారు. 300 గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఉందని అన్నారు పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు తీసుకున్న ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంద‌న్నారు. విద్యారంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని శ‌శి ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ SFS కన్వీనర్ శివ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్, నగర్ కార్యదర్శి జశ్వంత్, సన్నీ, నితీష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like