అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమే

మానవ జీవితంలో అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమేనని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని టచ్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి టచ్ ఆసుపత్రి వరకు 2కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి పాల్గొని కాగడా వెలిగించి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా వ్యాయామం, నడక, యోగ లాంటి అంశాలు ఉండేలా చూసుకోవాలన్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని అందించి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, కొద్ది దూరానికి వాహనాలు వినియోగించకుండా నడవాలని అన్నారు. మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు, పండ్లు, కార్బొహైడ్రేట్లు ఇతర పోషక విలువలు గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి రోజు 30 నిమిషాల నుండి 1 గంట వరకు శారీరక వ్యాయామానికి కేటాయించాలని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like