పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు

-ఆఫీసులో డాక్యుమెంట్లు, ఎమ్మెల్యేకు సంబంధించిన సాక్ష్యాలు తీసుకువెళ్లారు
-అందుకే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాను
-దుర్గం చిన్న‌య్య నా ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పాలి
-ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కురాలు షెజ‌ల్

Orijn’s Diary Controversy : పోలీసుల వైఖ‌రి వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాన‌ని, వారు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కురాలు షెజ‌ల్ అలియాస్ నందిని అలియాస్ శైల‌జ ఆరోపించారు. ఈ మేర‌కు ఆమె మ‌రో వీడియో విడుద‌ల చేశారు. ఇందులో పోలీసుల వైఖ‌రి, ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచార‌ణ కోసం వ‌చ్చిన పోలీసులు ఆఫీసులో అన్ని వెతికి కంప్యూట‌ర్లు, సెల్‌ఫోన్లు, డాక్యుమెంట్లు ప‌ట్టుకుపోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య సైతం తాను చేసిన ఆరోప‌ణ‌ల గురించి మాట్లాడ‌కుండా కంపెనీ గురించి మాట్లాడుతున్నాడ‌ని తాను చెప్పిన వాటికి స‌మాధానం ఇవ్వాల‌న్నారు. షెజ‌ల్ విడుద‌ల చేసిన వీడియోలో అంశాలు ఆమె మాట‌ల్లోనే…

ఈ నెల 5న కొంత‌మంది పోలీసులు బ‌ల‌వంతంగా ఆఫీసులోకి ప్ర‌వేశించారు. మా వ‌ద్ద ఉన్న‌ మొబైల్‌ఫోన్లు, కంపెనీకి చెందిన కంప్యూట‌ర్‌, డాక్యుమెంట్‌, ఎమ్మెల్యేకి సంబంధించిన సాక్ష్యాలు తీసుకున్నారు. మీరు ఎందుకు వ‌చ్చార‌ని ప్ర‌శ్నించినా ప‌ట్టించుకోలేదు. మీరు ఇలాగే ఎమ్మెల్యే గురించి బ‌య‌ట‌పెడితే మీ మీద ఇంకా కేసులు పెట్టాల్సి వ‌స్తుంద‌ని బెదిరించారు. వాళ్ల వేధింపులు భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నా. ఆసుప‌త్రిలో నాకు వైద్యం జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా న‌న్ను ఇబ్బందుల‌కు గురి చేశారు. నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడినా, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసి విష‌యం కూడా బ‌య‌ట‌కు చెప్పినా ఇంకా కేసులు పెడుతూనే ఉంటామ‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ బెదిరిస్తూనే ఉన్నారు. అలా పెట్టుకుంటూపోతే నీ మీద పీడీ యాక్టు అవుతుందన్నారు. పోలీసులు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు ఎందుకు అంత మ‌ద్ద‌తు చెబుతున్నారో అర్ధం కావ‌డం లేదు.

విచార‌ణ‌ కోసం వ‌చ్చామ‌ని పోలీసులు చెబుతున్నార‌ట‌.. విచార‌ణ‌ కోసం వచ్చిన‌ప్పుడు న‌న్ను ఇబ్బంది పెట్టాల్సిన అవ‌స‌రం ఏమెచ్చింది…? ఆఫీసు మొత్తం వెతికి చేసి డాక్యుమెంట్స్‌, అగ్రిమెంట్లు, ఎమ్మెల్యేకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ‌న్నీ ఎందుకు తీసుకువెళ్లారు…? ఎవ‌రిని కాపాడటానికి.. ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య మీద ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు….? ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేదు….? చిన్న మెసేజ్ పెట్టినందుకు బండి సంజ‌య్‌ను అరెస్టు చేశారు. మ‌రి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదని షెజ‌ల్ ప్ర‌శ్నించారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య న‌న్ను మోసం చేశాడ‌ని, నా ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని నేను చెబుతున్నా. అయినా ఆయ‌న వాట‌న్నింటిని కాద‌ని కంపెనీ మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. కంపెనీ మోసం చేసింద‌ని మాట మారుస్తున్నాడు. కంపెనీ మోసం చేసిందో..? లేదో..? తేల్చి చెప్ప‌డానికి న్యాయ‌స్థానాలు ఉన్నాయి. మీరు చేసిన త‌ప్పులు క‌ప్పి పుచ్చుకోవ‌డానికి మొత్తం కంపెనీ మీద నెట్టాల్సిన అవ‌స‌రం లేదు. మీరు చేసిన‌వన్నీ ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డ‌తాయి. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన వాటికి స‌మాధానం చెప్పండి అంటూ తాను విడుద‌ల చేసిన వీడియోలో షెజ‌ల్ అలియాస్ శైల‌జ అలియాస్ నందిని ప్ర‌శ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like