ప్రజారక్షణలో పోలీస్ శాఖ అహర్నిశలు పని చేస్తోంది

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దివస్

Ramagundam Police Commissionerate: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్న‌ద‌ని, పండుగ సెలవులు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపేందుకు వారు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ బ‌దావ‌త్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు సురక్ష దినోత్సవం నిర్వ‌హించారు. బైకుల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నేర నియంత్రణలో పోలీసు అధికారులు చేపడుతున్న చర్యల ద్వారా ప్రజలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారని తెలిపారు. పోలీసులు తమ విధులలో మరింత వేగంగా పని చేసేందుకు ప్ర‌భుత్వం నూతన వాహనాలు అందించడంతో పాటు వినూత్న సంస్కరణలతో పోలీసు శాఖను మరింత పటిష్టం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించి గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో ప్రజలు పోలీస్ స్టేషన్ కు ధైర్యంగా వస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిన మార్పులు షీ టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్, కళాజాత బృందం,ఫ్రెండ్లీ పోలిసింగ్, సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్,మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. మ్యూజిక్ వెహికల్, బ్లూకోట్, బుల్లెట్ వాహనం తో ట్రాఫిక్ పర్సనల్, పెట్రోకార్, షీటీం, సైబర్ క్రైం, క్లూస్ టీం, బాంబ్, డాగ్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ వాహనాలు, పాస్పోర్టు వెరిఫికేషన్ బ్యానర్ తో స్పెషల్ బ్రాంచ్ వాహనం, రోబో డ్రెస్సెస్ పెట్రోలింగ్ కార్స్, బ్లూ క్లోట్స్, ఫైర్ వెహికి ల్స్ తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధ్వర్యంలో నేరాల పరిశీలనతో పాటు పోలీస్ డాగ్ లతో చేపట్టిన సాహస ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like