టిక్కెట్టు వెన‌క అస‌లు ‘పురాణం’

-మాజీ ఎమ్మెల్సీ స‌డెన్ ఎంట్రీ వెన‌క అస‌లు ర‌హ‌స్యం..?
-నిజంగానే హామీ ల‌భించిందా..? లేక ఆయ‌నే తిరుగుతున్నారా..?
-పురాణం స‌తీష్ అస‌లు ల‌క్ష్యం ఎమ్మెల్యే టిక్కెట్టేనా..? మ‌రేదైనా కార‌ణ‌ముందా..?

Puranam Satish: పురాణం స‌తీష్‌.. ఉమ్మ‌డి ఆదిలాబాద్ రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. 1987లో తెలుగుదేశం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పురాణం టీడీపీ జిల్లా కార్యదర్శిగా, చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, టీడీపీలో ఆదిలాబాద్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ప‌నిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, 2010 నుంచి ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2015లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆయ‌న తూర్పు జిల్లాలో పార్టీ ప‌టిష్టానికి త‌న వంతుగా కృషి చేశారు. త‌న ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన త‌ర్వాత త‌న‌కే రెన్యూవ‌ల్ అవుతుంద‌ని భావించారు. కానీ, అధినేత అత‌న్ని కాద‌ని దండే విఠ‌ల్‌కు ఆ ప‌ద‌వి అప్ప‌గించారు. దీంతో ఆయ‌న ఆశ నిరాశే అయ్యింది. ఏదైనా కార్పొరేష‌న్ ప‌ద‌వి సైతం వ‌స్తుంద‌ని అనుకున్నా అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో ఆయ‌న తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఉద్య‌మ స‌మ‌యంలో తాను ఎంతో క‌ష్ట‌ప‌డినా త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

చాలా నెల‌లుగా ఆయ‌న సైలెంట్‌గా ఉంటున్నారు. స‌మ‌యం క‌లిసిరాక‌పోవ‌డంతో మౌన‌మే స‌మాధానం అయ్యింది. అయితే, స‌డెన్‌గా నెల రోజుల నుంచి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌దిరుగుతూ హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తున్నారు. పాత నేత‌ల‌ను క‌లుస్తూ మంచిర్యాల టిక్కెట్టు త‌న‌కే వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న‌ప్పుడు త‌న‌తో ప‌రిచ‌యం ఉన్న ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లుస్తూ మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. అక్క‌డ‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌ను కాద‌ని పురాణం నియోజ‌క‌వ‌ర్గం చుట్టి వ‌స్తున్నారు.

మ‌రి ఇంత సడెన్‌గా పురాణం స‌తీష్ రంగంలోకి దిగ‌డానికి కార‌ణ‌మేంటి..? ఆయ‌నకు అధిష్టానం నుంచి మ‌ద్ద‌తు ల‌భించిందా..? లేక ఆయ‌నే తిరుగున్నారా..? అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, అధిష్టానం అనుమ‌తి, మ‌ద్ద‌తు లేకుండా ఆయ‌న తిరుగుతారా…? అన్న‌ది అనుమానంగా మారింది. అధిష్టానం ఆయ‌నకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని అందుకే మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం చుట్టి వ‌స్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఆయ‌న ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం బ‌రిలో నిల‌బ‌డితే అధిష్టానం బుజ్జ‌గిస్తుంద‌ని, భ‌విష్య‌త్తులో త‌న‌కు ఏదైనా ప‌ద‌వి వ‌స్తుంద‌నే ఆశతో ఆయ‌న తిరుగుతున్నార‌నే ప్ర‌చారం సైతం సాగుతోంది.

ఇక్క‌డ మొద‌టి నుంచి దివాక‌ర్‌రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఆయ‌న లేదంటే ఆయ‌న కొడుకు విజిత్‌రావుకు టిక్కెట్టు ల‌భించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే అర‌వింద్‌రెడ్డి సైతం ఉన్నారు. ఆయ‌న అధిష్టానంపై అలిగి బీజేపీలో వెల్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీంతో అధిష్టానం ఆయ‌న‌ను బుజ్జ‌గించింది. అర‌వింద్‌రెడ్డి సైతం టిక్కెట్టు రేసులో ఉన్నారు. మ‌రోవైపు కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తి రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూస్కూరి రామ్మోహన్‌రావుకు సైతం టిక్కెట్టు కేటాయించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇక‌, బీసీ నేత‌ల‌కు టిక్కెట్టు ఇస్తే ఎలా ఉంటుంద‌నే విష‌యంలో మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వే కూడా జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీసీ నేత‌లు సైతం త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నారు. మంచిర్యాల మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ గాజుల ముఖేష్‌గౌడ్‌, న‌స్పూరు మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ తోట శ్రీ‌నివాస్ త‌దిత‌రులు త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. చాప కింద నీరులా టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు సైతం చేస్తున్నారు. ఇంత వ్య‌వ‌హారం జ‌రుగుతున్న త‌రుణంలో పురాణం స‌తీష్ స‌డెన్ ఎంట్రీ వెన‌క ప‌రామ‌ర్థం ఏమిట‌నే చ‌ర్చ సాగుతోంది.

పురాణంస‌తీష్ మూడు కార‌ణాల‌తో మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అందులో మొద‌టిది అధిష్టానం నుంచి హామీ ల‌భించ‌డం మొద‌టిది కాగా, ఈ టిక్కెట్టుపై గురి పెడితే క‌నీసం కేసీఆర్‌, కేటీఆర్ వేరే ప‌ద‌వి కోస‌మైనా త‌నపేరు ప‌రిశీలిస్తార‌న్న‌ది రెండోది. పురాణంస‌తీష్‌ పదవి కోసమా..? ప్రాపకం కోసమా..? అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం కోస‌మా..? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్ జిల్లాకు రానున్న నేప‌థ్యంలో ఈ విషయంపై కాక రేగుతోంది. మ‌రి అధినేత ఆయ‌న విష‌యంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like