రాజ‌దండ ర‌హ‌స్యం…

-అధికార బ‌దిలీకి నిద‌ర్శ‌న‌మ‌ది
-బ్రిటీష్ వారు దాన్ని ఇచ్చిన ఆధారాలు లేవ‌ని కాంగ్రెస్ వాద‌న
-దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ ద్వేషిస్తోందన్న బీజేపీ
-రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దానికి తెర తీసిన బంగారు రాజ‌దండం

Sengol: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం మ‌రోకొత్త ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వ‌యంగా వెల్లడించారు. అలాగే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు. బ్రిటిషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తుచేశారు. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్‌ లార్డ్ మౌంట్‌బాటెన్‌ స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అందించారని చెప్పారు. ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారన్నారు. తమిళ పదమైన సెమ్మాయ్‌(ధర్మం) నుంచి వచ్చిందని ఆయ‌న వెల్లడించారు.

రాజదండం కథ ఎలా మొదలైందంటే..?
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్‌, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్‌ బాటెన్‌ నెహ్రూను ప్రశ్నించారట. నెహ్రూ పక్కనే ఉన్న రాజగోపాలాచారి వైపు తిరిగి సలహా కోరారు. అప్పుడు రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని వివరించారు. కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి దానిని ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని తెలిపారు. చోళులు దానిని అనుసరించారని వెల్లడించారు. దాంతో ఆ రాజదండాన్ని తయారు చేసే పనిని నెహ్రూ రాజాజీకి అప్పగించారు.

అల‌హాబాద్ మ్యూజియంలో వాకింగ్ స్టిక్‌గా..
రాజగోపాలాచారి తిరువడుత్తురై అథీనం (ప్రస్తుత తమిళనాడులో ప్రఖ్యాత మఠం) ను సంప్రదించారు. రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు. దాని పొడవు ఐదు అడుగులు ఉండగా..పై భాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు. న్యాయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు. ఆ మఠానికి చెందిన స్వామీజి ఒకరు ఆ దండాన్ని మౌంట్‌బాటెన్‌కు అందించి, దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారట. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట. అర్ధరాత్రి స్వాతంత్య్ర‌ ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. 1947 ఆగస్టు తర్వాత రాజదండం గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. దీనిని మ్యూజియంలో వాకింగ్ స్టిక్‌గా న‌మోదు చేశారు.

స‌రైన ఆధారాలు లేవంటున్న కాంగ్రెస్‌..
అయితే, ఈ రాజ‌దండం వ్య‌వ‌హారంలో కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. పార్లమెంటు ఆవరణలో స్పీకర్ కుర్చీ రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించిన నేప‌థ్యంలో దీనిపై తాజాగా దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటీష్ చివరి వైశ్రాయ్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్.. అధికార బదిలీకి గుర్తుగా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు బీజేపీ వెల్లడించింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఆ పార్టీ నాయ‌కులు బీజేపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రాజ‌దండం వ్య‌వ‌హారాన్ని బీజేపీ త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటోంద‌ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ స్ప‌ష్టం చేశారు.

భార‌త సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కాంగ్రెస్ ద్వేషిస్తోంది..
ఇదే అంశంపై కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ద్వేషిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. భారతదేశ స్వాతంత్య్రానికి గుర్తుగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం.. జవహర్ లాల్ నెహ్రూకు ఆ రాజదండాన్ని అందించిందని తెలిపారు. ఆ రాజదండాన్ని మ్యూజియంలో ఒక వాకింగ్ స్టిక్‌గా ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను కాంగ్రెస్ పార్టీ బోగస్ అంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిపై పునరాలోచించుకోవాలని హితవు పలికారు. ఈ రాజదండం చరిత్ర, ప్రాధాన్యత చాలామందికి తెలీదని అమిత్‌ షా అన్నారు. ప్రస్తుత ఈ ఏర్పాటు.. మన సంప్రదాయాలను, ఆధునికతకు సంధానించే ప్రయత్నమని తెలిపారు. ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like