నకిలీ విత్తనాల పాపం.. ఎమ్మెల్యేల హస్తం…

-యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులు, ప్రజాప్రతినిధులు
-వారికి అండగా ఎమ్మెల్యేలు
-వారి జోలికి వెళ్లకుండా, కేసులు కాకుండా బెదిరింపులు
-దీంతో రెచ్చిపోతున్న నకిలీ విత్తన వ్యాపారులు
-ఎమ్మెల్యేల పాత్రపై నిఘా వర్గాల నివేదిక

Fake seeds: ప్రజలు తప్పుదోవ పట్టకుండా, వారికి ఎలాంటి కీడు జరగకుండా చూడాల్సిన ఎమ్మెల్యేలే తమ వారి కోసం తప్పు చేస్తున్నారు. అలా చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ప్రజలు ముఖ్యంగా పది మందికి అన్నం పెట్టే రైతన్న నష్టపోతున్నాడు. ఎవరు నష్టపోయినా మాకేం అన్నట్లు ప్రజాప్రతినిధులు మాత్రం యథేచ్ఛగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఎమ్మెల్యేలపై నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాయి.

తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఉంది నకిలీ విత్తనాల వ్యాపారం పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేస్తుంటారు. రాష్ట్రంలోనే అత్యధిక పత్తి పండించే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీటీ (గడ్డి) విత్తనాల పేరుతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా వీటిని రైతులకు అంటగడుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఇక్కడకు వచ్చి ఆ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారం కోట్లలో నడుస్తోంది.

అయితే ప్రభుత్వం వీటిపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ విత్తనాలు అమ్మే వారిపై దాడులు చేస్తోంది. దీంతో నకిలీ విత్తన మాఫియా తెలివిగా స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల పంచన చేరారు. దీంతో వారు పోలీసులు, అధికారులకు ఫోన్ చేసి తమ వారిని పట్టుకోవద్దని హుకుం జారీ చేస్తున్నారు. వారు అధికారానికి తలొగ్గి అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

– ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు ఈ నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. ఓ ఎమ్మెల్యే వారికి పూర్తి అండదండలు అందిస్తూ వారి మీద ఈగ వాలకుండా చూస్తున్నారు. అటు వైపు ఎవరైనా పోలీసులు, అధికారులు డబ్బులు సైతం ముట్టచెబుతున్నారు. వినని వారిని బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో అధికారులు మౌనంగా ఉంటున్నారు.

– నెన్నల మండలానికి చెందిన ఓ వ్యక్తికి ప్రజాప్రతినిధి ఒకరు రూ. 10 లక్షలు ఇచ్చి మరీ ఈ నకిలీ విత్తన వ్యాపారం చేసుకోమని ప్రోత్సహించారు. దీంతో అతను రెండు సంవత్సరాలుగా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి వెనకాల ఉన్న రాజకీయ అండదండలతో ఎవరూ అతన్ని పట్టుకోలేకపోతున్నారు.

– భీమిని, కన్నెపల్లి మండలాల్లో ఓ రాజకీయ నేత అండదండలతో ఆయన అల్లుడు, మరి కొందరు వ్యాపారులు ఈ విత్తనాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఆ నేత రెండు మండలాల్లో అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే కొనసాగుతాయి. దీంతో వాళ్లను పట్టుకోవడం అటుంచి అటువైపు చూడాలంటేనే పోలీసులు, అధికారులు భయపడుతున్నారు.

– తాండూరు మండలంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారి ఒకరు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. గతంలో పట్టుబడినప్పుడు రూ. 10 లక్షలు ఖర్చు చేశాడు. అంతేకాకుండా, ఓ ఎమ్మెల్యేతో సైతం చెప్పించుకుని తన జోలికి వెళ్లకుండా చూసుకున్నాడు. ఈ ఏడాది సైతం పెద్ద ఎత్తున విత్తనాలు తెప్పించిట్లు సమాచారం.

– తాండూరు మండలానికి చెందిన కొడిపాక రంజిత్ గతంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన సైతం పత్తి విత్తనాల దందా చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట టాస్క్ఫోర్స్ తనిఖీల్లో దొరికిన విత్తనాలు ఈయన దగ్గరే కొన్నట్లు దొరికిన నిందితులు తెలిపారు. చాలా ఏండ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వెనక ఓ పెద్ద ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో అతన్ని పట్టుకునేందుకు సైతం పోలీసులు సాహసం చేయలేకపోయారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల వ్యాపారులు, ఆ వ్యాపారం చేస్తున్న తమ అనుచరులను కాపాడుతున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై నిఘా వర్గాలు తమ నివేదికను అటు పోలీస్ బాస్తో పాటు ముఖ్యమంత్రికి సైతం పంపించినట్లు సమాచారం. ఎన్నికల సమయం కావడంతో విషయాన్ని సీరియస్గా తీసుకుని నకిలీ పత్తి విత్తనాలపై సీరియస్గా దృష్టి పెట్టాలని పోలీసులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. మరి వారు కూడా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపి రైతులను నష్టం జరగకుండా చూసుకుంటారా..? లేక ప్రతి ఏడాది లాగానే రైతుల మానాన రైతులను వదిలేస్తారా..? చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like