50 ఏండ్ల‌లో ఇదే త‌క్కువ వ‌ర్ష‌పాతం

Rains: ఈ ఏడాది ఆగ‌స్టులో చెదురుమెుదురు వానలు మినహా.. ఆశించినంతగా వర్షాలు కురవలేదు. తెలంగాణలో చాలా ఏండ్ల త‌ర్వాత అత్యల్ప వర్షపాతం నమోదైంది. గత 50 ఏళ్ల ఇంత త‌క్కువ వ‌ర్ష‌పాతం ఎప్పుడూ న‌మోదు కాలేదంట‌. జులై చివరివారంలో దంచి కొట్టిన వరణుడు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు.

వాస్త‌వానికి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం కురిసింది. జులైలో అధిక‌ వర్షాలతో ఝ‌డిపించిన వరుణుడు.. ఆగస్టులో కనుమరుగయ్యాడు. 1972 ఆగస్టు తర్వాత ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదైందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ ఏడాది ఆగ‌స్టులో కేవ‌లం 74.4 మి.మీ సగటు వర్షపాతం మాత్రమే నమోదైంది, ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ అని అధికారులు వెల్లడించారు. 1960 నుంచి రాష్ట్రంలో ఇది మూడో అత్యల్ప లోటు వర్షపాతం. 1960లో 67.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా..1968లో 42.7 మి.మీ, 1972లో 83.2 తాజాగా.. ఈ ఏడాది ఆగస్టులో 74.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

సాధారణంగా తెలంగాణలో 120 రోజుల వర్షాకాలం ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో 60 నుండి 70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని.. మిగిలిన రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయన్నారు. సాధారణంగా ఈ 60 నుంచి 70 రోజుల వర్షం.. 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయన్నారు. అయితే.. ఈ ఏడాది నైరుతి రుతపవనాల రాకే ఆలస్యమైందని.. దీంతో జూన్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. జులై చివర్లో మంచి వర్షాలు కురిసినా.. ఆగుస్టులో వరుణుడు ముఖం చాటేశాడని వెల్లడించారు. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

లోటు వర్షపాతం నమోదు కావటానికి ఎల్ నినో ప్రధాన కారణంగా వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్‌లో అత్యధికంగా 93, జనగామలో 90, సిద్దిపేటలో 83, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో 82 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 44 మండలాల్లో అత్యధికంగా, 284 మండలాల్లో అధిక, 242 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా 42 మండలాల్లో లోటే ఉంది.

అయితే.. సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హిందూ మహాసముద్రం అంతటా ఉష్ణోగ్రతలు మారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో తెలంగాణ మెరుగైన వర్షాలు కురుస్తాయని అంటున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలోనూ ఒక వారం పాటు రుతుపవనాల విరామం ఉంటుందని.. ఆ తర్వాత రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like