బీఆర్ఎస్ ఆంధ్రా చీఫ్‌గా తోట చంద్రశేఖర్

-ప‌వ‌న్ క‌ళ్యాణ్ రైట్ హ్యాండ్‌పై క‌న్నేసిన కేసీఆర్‌
-కాపు ఓట్లు సైతం గంప‌గుత్త‌గా కొట్ట‌గొట్టే వ్యూహం
-సోమ‌వారం పార్టీలో చేర‌నున్న ప‌లువురు ఆంధ్రా నేత‌లు

Thota Chandrasekhar as BRS Andhra Chief: భారత్ రాష్ట్ర సమితి విస్త‌ర‌ణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయ‌న జాతీయస్థాయిలో విస్త‌ర‌ణ కోసం ఆయా రాష్ట్రల్లో నేత‌లపై క‌న్నేశారు. ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌లు పార్టీల నుంచి నేత‌ల‌ను త‌మ‌వైపు ఆక‌ర్షించేలా చేస్తున్నారు.

కేసీఆర్ ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఏపీలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఏపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరడానికి సన్నద్ధమ‌వుతున్నారు కూడా. అయితే, ఎవ‌రిని ప‌డితే వారిని చేర్చుకోకుండా కేసీఆర్ చాలా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఆయా పార్టీల్లో నేత‌ల ప‌నితీరు, వారు జాతీయ స్థాయిలో నిర్వ‌హించ‌నున్న పాత్ర ఇలా అన్ని ర‌కాలుగా బేరీజు వేసుకుని మ‌రీ ముందుకు సాగుతున్నారు.

ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న క‌న్ను జ‌న‌సేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిగా కీల‌క ప‌ద‌విలో ఉన్న తోట చంద్ర‌శేఖ‌ర్‌పై ప‌డింది. ఆయ‌న జ‌న‌సేన‌లో కీల‌క‌స్థానంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని స‌మాచారం. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే అధినేత‌కు స‌మాచారం అందిస్తున్నారు. ఆయ‌న పార్టీలో చేర‌గానే ఏపీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టిస్తార‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ 2009లో సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరఫున గుంటూరు లోక్ సభ స్థానంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో ఉండవల్లి అరుణ్ కుమార్, జయ ప్రకాశ్ నారాయణ్‌లతో పాటు ఆయన కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్నారు. ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు సమగ్రంగా, కచ్చితంగా వివరిచండానికి పవన్ కల్యాణ్ ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

కాపు ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు కేసీఆర్ ఆయ‌నను ఏపీ చీఫ్‌గా నియ‌మించేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసీఆర్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీన్ని సొమ్ము చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ను నెలకొల్పినందుకు ఇప్పటికే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో పలు చోట్ల భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఖరారు చేశారని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like