బ‌డుగులపై పిడుగుల వాన‌

పిడుగు ప‌డి ముగ్గురి మృత్యువాత‌

రెక్కాడితే కానీ డొక్కాడ‌ని జీవులు వారు.. వారిపై పిడుగుల వాన ప‌డింది.శ‌నివారం వ‌ర్షంతో పాటు పిడుగుల వ‌ర్షం ప‌డింది. దీంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే… బెజ్జూరు మండలం పోతెపల్లికి చెందిన తోడ్యం పోశక్క(21) మంచిర్యాల పట్టణంలో బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. త‌న గ్రామానికి వ‌చ్చిన ఆమె కూలీ ప‌ని కోసం చేనులోకి వెళ్లింది. గ్రామసమీపంలోని పంటచేనులో మిరపచెట్లు నాటుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో బూదక్క అనే వృద్ధురాలితో పాటు పోశ‌క్క సైతం ఇంటికి బ‌య‌ల్దేరింది. ఇంటికి వెళ్తున్న క్రమంలో పిడుగుపడడంతో ఇద్దరు అస్వస్థతకు గురై కుప్పకూలారు. వీరిని వైద్యం కోసం కాగజ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించగా పోశ‌క్క అప్పటికే మృతిచెందింది. తీవ్రగాయాలపాలైన బూదక్కను మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి త‌ర‌లించారు.

ఇదే జిల్లాలో వాంకిడి మండలం ఎనగొంది గ్రామానికి చెందిన ఆత్రం గోవింద్ రావు పై (28) పిడుగు పడి మృత్యువాత‌ప‌డ్డాడు. వ‌ర్షం వ‌స్తున్న క్ర‌మంలో నవేదరి గ్రామ సమీపంలో ఓ చెట్టు కింద నిలబడి ఉన్న గోవింద్ రావు పై పిడుగు పడింది. దీంతో ఆయ‌న అక్క‌డిక్క‌డే మృత్యువాత ప‌డ్డాడు. మంచిర్యాల జిల్లా బీమారం మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో పిడుగుపాటుతో బండారి లింగయ్య (64) అనే రిటైర్డు సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. వర్షంపడి తగ్గడంతో బ్యాంకుకు వెళ్ళిన లింగయ్య నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఒక్క సారిగా లింగయ్యపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి వంద మీటర్ల దూరంలోనే లింగయ్య పై పిడుగు పడి మృతి చెందాడు. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరే స‌మ‌యంలోనే పిడుగుపాటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య రమ, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు.

శ‌నివారం పిడుగుపాటుతో ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవ్ గాం సబ్ స్టేషన్ పై పిడుగు ప‌డింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు అధికారులు కృషి చేస్తున్నారు. మ‌రోవైపు కుశ్నపల్లి గ్రామ పంచాయతీలోని ఇందుర్గాం గ్రామానికి చెందిన నికాడి అశోకక్కు చెందిన ఎద్దు శనివారం పిడుగుపాటుకు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని యజమాని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like