క‌ట్టేసి… కింద పొగ పెట్టేసి…

ద‌ళితుడిపై అమానుష దాడి

ఘోరం… అమానుషం… స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న ఇది.. ఎక్క‌డో మారుమూల ప‌ల్లెల్లో జ‌రిగింది కూడా కాదు… మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఘ‌ట‌న దారుణ‌మిది.. ఓ ద‌ళితున్ని క‌ట్టేసి కొట్టారు.. అది కూడా కింద పొగపెట్టి మ‌రీ చిత‌కబాదారు.. వివ‌రాల్లోకి వెళితే..

మందమర్రి ప‌ట్ట‌ణంలోని యాప‌ల్ ఏరియాలో కిర‌ణ్‌(30) అనే ఎస్సీ యువ‌కుడు నివాసం ఉంటున్నాడు. అత‌ను రెండు మేక‌లను దొంగ‌త‌నం చేశాడ‌నే నెపంతో అదే వాడ‌కు చెందిన రాములు, అత‌ని కొడుకు శ్రీ‌నివాస్‌, ఆయ‌న భార్య స్వ‌రూప‌, వారి ద‌గ్గ‌ర ప‌నిచేసే న‌రేష్ మేక‌ల కొట్టం ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు. అక్క‌డే మండిలోని దూలానికి క‌ట్టేసి.. కింద పొగ‌పెట్టి కిర‌ణ్‌ను చిత‌క‌బాదారు. అతనికి సహకరించాడని మండి కాపరి తేజను కూడా కొట్టారు. త‌మ మేకలు దొంగ‌త‌నం చేసినందుకు డ‌బ్బులు క‌ట్టాల‌ని కొట్టారు. దీంతో అదే ప్రాంతానికి చెందిన శ్రావ‌ణ్ అనే వ్య‌క్తి డ‌బ్బులు తాను క‌డ‌తాన‌ని చెప్పి కిర‌ణ్‌కు తీసుకువ‌చ్చాడు.

అయితే, ఏమైందో తెలియ‌దు కానీ, కిర‌ణ్ క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో త‌మ అక్క కొడుకు క‌నిపించ‌డం లేద‌ని కిర‌ణ్ చిన్న‌మ్మ నిట్టూరి సరిత పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. బెల్లంప‌ల్లి ఏసీపీ పంతాటి స‌ద‌య్య విచార‌ణ చేప‌ట్టారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌నిపించ‌కుండా పోయిన కిరణ్ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన‌ట్లు ఏసీపీ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like