ట‌మాట డ‌బుల్ సెంచ‌రీ

Tomato:ట‌మాట ధ‌ర‌లు ఇప్పుడ‌ప్పుడే త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. నిన్నమొన్నటి వరకు సెంచరీ దాటిన ధరలు ఇప్పుడు డబుల్‌ సెంచరీ చేరుకున్నాయి. నెల రోజులు అయినా రాష్ట్రంలో టమాట ధరలు దిగిరావడం లేదు. కిలో టమాట ధర రూ. 200 పలుకుతోంది. దీంతో టమాట కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నెల కింద‌ట రాష్ట్రంలో కిలో టమాట ధర రూ. 50లోపే ఉంగా ఇప్పుడు డ‌బుల్ సెంచ‌రీ మార్కును దాటింది. జిల్లా కేంద్రాల్లో కంటే గ్రామాల్లోనే టమాట ధరలు అధికంగా ఉండడంతో పేద, సామాన్యులు టమాట కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

టమాట ధరలు వారం ప‌ది రోజుల్లో త‌గ్గుతాయ‌ని అంద‌రూ భావించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. అయినా, ఆ సూచ‌ల‌నేవి ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. వేసవి ముగింపులో యాసంగి టమాట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో పంట నాశనమై టమాట ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణాకు ఆటంకం ఏర్ప‌డుతోంది. టమాట పంట దెబ్బతిని మరో మారు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి.

పెరిగిన టమాట ధరలు దేశవ్యాప్తంగా ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో కిలో టమాట ధర రూ.200ను తాకగా… చాలా రాష్ట్రాల్లో రూ. 200 నుంచి రూ.250కి కిలో టమాటాను విక్రయిస్తున్నారు. ఇక చండీగడ్‌ మార్కెట్‌లో రిటైల్‌ దుకాణాల్లో ఏకంగా కిలో టమాటను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తుండడం గమనార్హం. టమాట ధరలు రోజు రోజుకు పెరగటమే కాని తగ్గకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాట ధరనే అధికంగా ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like