ఓదెలుకు నోటీసులు.. ఆర‌ని మంట‌లు..

TPCC has issued notices to Odelu: కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి మంట‌లు చ‌ల్లార‌డం లేదు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావుకు, కొత్త‌గా పార్టీలో నేత‌లకు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. దీంతో అధిష్టానం త‌ల ప‌ట్టుకుంటోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలుకు కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో వివాదం మ‌రింత ముదిరింది.

నల్లాల ఓదెలుకు కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా.చిన్నారెడ్డి ఓదెలుకు షోకాజు నోటీసు జారీ చేశారు. గత నెల 28న మంచిర్యాలలో ప్రేంసాగ‌ర్‌రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో పార్టీ స‌మావేశం జ‌రిగింది. అయితే ఈ స‌మావేశానికి జ‌డ్పీ చైర్మ‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలును పిల‌వ‌లేదు. దీంతో గాంధీభ‌వ‌న్‌కు ఓదెలు స‌మాచారం అందించారు. మీరు వెళ్లాల‌ని అక్క‌డి నుంచి సూచ‌న‌లు రావ‌డంతో ఆయ‌న స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన వారిద్ద‌రిని స‌భ్యులు కాని వారు స‌మావేశం ఉండొందంటూ వెళ్లిపోమ‌ని హెచ్చ‌రించారు. దీంతో ఓదెలు, భాగ్య‌ల‌క్ష్మి సమావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. వెళ్తూవెళ్తూ మీడియాతో మాట్లాడారు. త‌మ‌ను ప్రేంసాగ‌ర్‌రావు, కొక్కిరాల సురేఖ కావాల‌నే అవ‌మానించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను దళితున్ని కాబ‌ట్టే త‌న‌ను ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రేంసాగ‌ర్ రావు ఎన్నిక‌ల్లో డ‌బ్బులు తీసుకున్నార‌ని, పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, ఆ స‌మావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆ స‌మావేశానికి AICC కార్యదర్శి రోహిత్ చౌదరి సైతం హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ DCC అధ్యక్షురాలు సురేఖ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేర‌కు TPCC క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా.చిన్నారెడ్డి ఓదెలుకు షోకాజు నోటీసు జారీ చేశారు. త‌న‌కు ఎలాంటి నోటీసు అంద‌లేద‌ని చెప్పిన న‌ల్లాల ఓదెలు చిన్నారెడ్డి ముందు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఇప్పుడు ఓదెలు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like