ట్రాఫిక్ జ‌రిమానాలు రూ. 533 కోట్లు

ఏడాది కాలంలో 1.49 కోట్ల చ‌లాన్లు - రోజుకు సుమారు రూ. కోటిన్న‌ర

ట్రాఫిక్ చ‌లాన్ల‌కు సంబంధించి ఈ ఏడాది పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయి. ఏడాది కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 1,49,03,556 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి దాదాపు రూ.533 కోట్లు జరిమానాగా విధించారు. ఆ లెక్క‌న‌ సగటున రోజుకు సుమారు రూ.కోటిన్నర అన్నమాట‌.

ఈ ట్రాఫిక్ చ‌లాన్ల‌ను ప‌రిశీలిస్తే ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌పై ఎక్కువ చ‌లాన్లు న‌మోద‌య్యాయి. అందులోనూ హెల్మెట్ ధ‌రించ‌ని వారిపై ఈ చ‌లాన్లు ఎక్కువ‌గా అవ‌డం గ‌మ‌నార్హం. హెల్మెట్ ధరించని వారిపై సుమారు కోటి పది లక్షల చలాన్లు వేశారు. మొత్తం జరిమానాల్లో వాటిదే 37.33 శాతం.. ఆ తర్వాతి స్థానం (27.2%) ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవి ఉన్నాయి. ట్రిపుల్‌ రైడింగ్‌ సంబంధించినవి 10.2 శాతం.. మొత్తం వసూళ్లలో ఈ మూడింటివే 74.7 శాతంగా ఉన్నాయి. వీటిని బట్టి ద్విచక్ర వాహనదారులపైనే భారీగా జరిమానాలు పడినట్టయింది.

ఇక బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకున్నా.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ లాంటి చోట్ల ద్విచక్రవాహనానికి సైడ్‌ మిర్రర్లు లేకున్నా, హాఫ్‌ హెల్మెట్‌ ధరించినా జరిమానాలు విధిస్తుండటంతో రోజూ ఇబ్బడిముబ్బడిగా వాహనదారులపై చలాన్లు పడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హెల్మెట్ ధరించని కారణంగానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like