టీఆర్ఎస్ ఆధిప‌త్య పోరుకు వేదిక‌గా..

-ర‌సాభాస‌గా ముగిసిన‌ ఆదిలాబాద్ జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం
-బ‌య‌ట‌ప‌డ్డ టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య విబేధాలు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాక్షిగా టీఆర్ఎస్‌ పార్టీ ఆధిపత్య పోరు, నేతల మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. శ‌నివారం జిల్లా స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ప్రారంభం అయ్యింది. చ‌ర్చ సాగుతుండ‌గా, బోథ్ మండలం ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై సమావేశం గందరగోళంగా మారింది. బోథ్ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకల‌పై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగినా, అధికారులు విచార‌ణ చేసి ప‌ట్టించుకోక‌పోవడం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆడిట్ నివేదిక బహిర్గతం చేయకపోవ‌డం ఏమిట‌ని జడ్పీ సమావేశాన్ని బ‌హిష్క‌రించారు. అంతలోనే కలెక్టర్ కల్పించుకొని… ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత బోథ్ ఎంపిడిఓ రాధను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో కలెక్టర్ నిర్ణయానికి వ్య‌తిరేకంగా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి కాకుండా ఎంపిడిఓను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఒత్తిడితో ఓ మహిళ అని చూడకుండా మండల అభివృద్ది కోసం కృషి చేసిన అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ నిర్ణయానికి నిరసనగా ఎంపీపీ తుల శ్రీనివాస్ ఈ స‌మావేశం బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు కాంగ్రెస్ జ‌డ్పీటీసీ సైతం ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపిడిఓ భర్త ఓ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ఆయన అకౌంట్లో మండల అభివృద్ది నిధులు ఎలా మళ్లించారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు.

ఇక మిష‌న్ భ‌గీర‌థ అధికారుల ప‌నితీరుపై ఎమ్మెల్యే జోగు రామ‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగం చేస్తున్నారా తమాషా చేస్తున్నారా… అంటూ ప్ర‌శ్నించారు. ఇలా ఆదిలాబాద్ జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం వేదిక‌గా అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ‌టంపై ఆ పార్టీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇప్పటికే బోథ్ ఎమ్మెల్యే వర్సెస్ బోథ్ ఎంపీపీ గా రాజకీయ క‌క్ష‌లు కొనసాగగా.. ఎంపీడీవో సస్పెన్షన్ తో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగి విభేదాలు తారాస్థాయికి చేరిన‌ట్ల‌య్యింది. ఇప్పటికే ఒకరిపై మరొకరు అధిష్టానికి ఫిర్యాదులు చేస్తూ ఉండగా… ఎంపీడీవో సస్పెన్షన్ అంశం మరోసారి ప్రగతి భవన్ కి చేరనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like