టీఆర్ఎస్ మండ‌లాధ్య‌క్షుడు అరెస్ట్..

-తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరింపులు
-రిమాండ్ పై సబ్ జైలుకు తరలింపు

TRS mandal president arrested: హనుమకొండ జిల్లా ఆరెపల్లిలో జరిగిన ల్యాండ్ మాఫియా కేసులో టీఆర్ఎస్ మండ‌ల అధ్యక్షుడు అరెస్టు అయ్యాడు. భూముల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో తుపాకీతో బెదిరించిన కేసులో ఇప్పటికే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ సంపత్ కుమార్, నయీం ప్రధాన అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ తో సహా పది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా బుధవారం రాత్రి వరంగల్ ​జిల్లా నల్లబెల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సారంగపాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన అనేక భూవివాదాల్లో తలదూర్చినట్లు గుర్తించారు. కేయూ క్రాస్ రోడ్​లోని ఓ భూమి విషయంలో నయీం అనుచరుడు వేణుగోపాల్ గ్యాంగ్​తో కలిసి సెటిల్ మెంట్ కు పాల్పడ్డట్లు గుర్తించారు.

మ‌రోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు టీ షర్టు వెనక భాగంలో బైటికి కనిపించేలా గన్ పెట్టుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఓ కార్యక్రమంలో అందరికీ కనిపించేలా ఆయన వద్ద గన్ ఉన్న తీరు చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో పలువురికి గన్లైసెన్స్ లు ఇస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఈ విష‌యంపై స్పందిస్తూ విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నామ‌నేది అవాస్తవమని చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు జారీ చేశామని తెలిపారు. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని తిరుగుతున్న నాయకుడిని హెచ్చరించానని, మరోసారి ఇలా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like