టీటీడీ.. వివాదాల పాల‌క మండ‌లి

-వివాదాస్పదమవుతున్న పాలకమండలి నిర్ణయాలు
-హడావుడి చేసి తరువాత టీటీడీ యూటర్న్
-ఆర్జిత సేవా టిక్కెట్ల రేట్లు పెంచ‌డం లేద‌ని వివ‌ర‌ణ‌
-ప్రైవేటు హోట‌ళ్ల‌ను ఎత్తివేయ‌మ‌ని హామీ

భ‌క్తుల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అస‌లు విష‌యాలు మ‌రిచి కొస‌రు విష‌యాల్లో త‌ల‌దూర్చుతోంది. దీంతో ఆ మండ‌లి ప‌నితీరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ నిర్ణయాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. తాజాగా ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు.. ప్రైవేటు హోటళ్ల మూసి వేత కూడా ఆ కోవలోకే చేరాయి. అయితే టీటీడీ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతుండడం ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డం వెంటనే మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్న అది వివాదంగా మారుతోంది. మొద‌ట ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డం, అది వివాదం కావ‌డం తిరిగి దాన్ని వెన‌క్కి తీసుకోవ‌డంతో టీటీడీ తీవ్ర విమర్శలపాలవుతోంది. వాస్త‌వానికి ఏదైనా నిర్ణ‌యం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. దాని అమ‌లు త‌ర్వాత ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే విష‌యంలో ఒక అవ‌గాహ‌న‌కు రావాలి. అప్పుడు కానీ అది అంద‌రికీ ఆమోద‌యోగ్యం కాదు. కానీ అందుకు విరుద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం టీటీడీకి ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు, హోటళ్ల మూసివేత ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు. వాటికి హాజరైన భక్తులు స్వామి వారికి హుండీలో పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తారు. సుప్రభాత సేవ మొదలుకోని.. వీఐపీ బ్రేక్ దర్శనం సమయానికే మూడో వంతు హుండీ ఆదాయం లభిస్తుంది. అందుకే ఆర్జిత సేవల టికెట్స్‌ రేట్లను ఆర్థికపరమైన అంశంగా టీటీడీ ఎప్పుడూ చూడదు. పైపెచ్చు పరిమిత సంఖ్యలో జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుతో ఆలయానికి వచ్చే ఆదాయం కన్నా.. ప్రభుత్వానికి వచ్చే అప్రతిష్టే ఎక్కువ అవుతోంది. దీంతో ఈ అంశాన్ని ఎవరూ ముట్టుకునేందుకు సాహసించరు.

గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రయత్నమే అప్పటి పాలకమండలి చేసింది. ధరల పెంపు కోసం సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రతిపాదించిన ధరలు పాలకమండలి సమావేశం రోజున బయటకు పొక్కడంతో రచ్చ మొదలైంది. ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోక తప్పలేదు. దాంతో పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఉన్న పాలకమండలి కూడా తాము ఇప్పుడు ఆర్జిత సేవల ధరలు పెంచడం లేదని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా వివాదాస్పద అంశాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రభుత్వం పెద్దలు అక్షింతలు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఆర్జిత సేవా టిక్కెట్ల విష‌యంలో నిర్ణయం తీసుకోలేదు… అలాంటి ఆలోచనే లేదని పాలకమండలి పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపు తిరుమలలో హోటళ్లు మూసివేస్తున్నట్టు మొదట అధికారులు చెబుతూ వచ్చారు. ఇది కూడా పెను వివాదంగా మారింది. తిరుమల కొండపై ఉండే వ్యాపారులంతా టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.. ఇంతకాలం స్వామినే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏంటి అని నిలదీశారు. ఈ వ్యాపారం తప్ప మరో విధంగా తమకు జీవించడం రాదని మొర పెట్టాకున్నారు. దీనిపై ఉద్యమం చేయాలని కూడా నిర్ణయించారు.. ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో పాలకమండలి వెనుక అడుగు వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like