ఇద్దరు న‌కిలీ న‌క్స‌లైట్ల అరెస్టు

-రెండు ఎయిర్ గన్స్, ఒక మోటర్ సైకిల్, ఒక ఫోన్ స్వాధీనం
-వివరాలు వెల్ల‌డించిన రామ‌గుండం క‌మిష‌న‌ర్ రెమా రాజేశ్వ‌రి

నక్సలైట్ల‌మ‌ని పేరు చెప్పుకుని ఎయిర్‌గ‌న్ల‌తో బెదిరించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి గురువారం వెల్ల‌డించారు. ఇద్ద‌రు నిందితుల‌కు సంబంధించిన వివ‌రాల‌కు విలేక‌రుల‌కు తెలిపారు. ల‌క్ష్సెట్టిపేట మండ‌లం ఇటిక్యాల‌కు చెందిన మేడివెంకటేష్, పెద్దంపేట‌కు చెందిన ఆరేందుల రాజేష్ ఇద్ద‌రు స్నేహితులు. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ స‌రిగ్గా న‌డ‌వ‌క‌పోవ‌డంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ నక్సలైట్ల పేరుతో డ‌బ్బులు సంపాదించాల‌ని ప‌న్నాగం ప‌న్నారు. వెంకటేష్ హైదరాబాద్ నుంచి రెండు ఎయిర్ గన్స్, ఫోన్, కొత్త సిమ్ కొనుగోలు చేశారు. తరువాత నస్పూర్లో కాంతయ్య అనే వ్య‌క్తి ఇంటి వద్ద రెక్కీ నిర్వ‌హించారు. గత నెల 21న‌ రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ సంచిలో పెట్టుకొని వచ్చి అర్దరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.

తెల్ల‌వారి రాజేష్, వెంకటేష్ కలిసి కాంతయ్యకి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సలైట్లం మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం.. మీరు 40 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతామ‌ని బెదిరించారు. మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో ఈ కేసు ద‌ర్యాప్తు చేసి చాక‌చ‌క్యంగా చేధించారు. ఈ సంద‌ర్భంగా మంచిర్యాల రూర‌ల్ సీఐ బి.సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవికుమార్, ఎండీ. సలీం, బి.దేవేందర్, పీసీలు శ్రీధర్, ఇర్షాద్ కు క‌మిష‌న‌ర్ రివార్డ్ అందజేసి అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like