ఆయ‌న రాక‌… కాంగ్రెస్ పార్టీలో కాక‌..

-త‌మ‌నే న‌మ్మడం లేద‌ని కాంగ్రెస్ నేత‌ల ఆరోప‌ణ‌
-ప్రేంసాగ‌ర్ రావు వ‌ర్గంగా ముద్ర వేసి దూరం చేస్తున్నార‌ని ఆవేద‌న‌
-దిక్కుతోచ‌ని స్థితిలో పార్టీ మారిన నేత‌లు

Congress: ఆ నాయకుడు సొంత పార్టీ నేతలతే నమ్మడం లేదా..? వారి చుట్టూ తన సైన్యాన్ని మోహరించారా..? జంపింగ్ జిపాంగ్గా పేరున్న ఆయన కొత్తగా పార్టీ మారి పాత వాళ్లను కనీసం పట్టించుకోవడం లేదా..? జెండాలను మోసి అదే పార్టీని నమ్ముకున్న వారు ఇప్పుడు పరాయి వారయ్యారా..? ఆయన ఆధిపత్యం భరించలేక ఏం చేయాలో దిక్కుతోచక సొంత పార్టీ నేతలు సతమతం అవుతున్నారా..? కొత్తగా పార్టీ మారిన వారు ఎందుకు వచ్చాం రా భగవంతుడా అని మదనపడుతున్నారా..? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.. ఇంతకీ ఆ నేత ఎవరు..? ఈ తంతు ఏ నియోజకవర్గంలో జరుగుతోంది…?

వివేక్.. దేశంలోనే ధనికుల్లో ఒకడిగా, తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా పేరుంది. ఆయన ఒకమారు ఎంపీగా గెలుపొందినా ఆ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. నిత్యం పార్టీలు మారుతూ ఆయనకు ఉన్న ప్రతిష్ట దిగజార్చుకున్నారు. ఆయన పార్టీలు మారడంలో ఒక రకంగా రికార్డు స్థాపించారు కూడా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పదే పదే మార్చుతూ బొంగరంలా గుండ్రగా తిరిగిన ఆయన తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. వివేక్ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారాడనే పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక సొంత పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు..

సొంత పార్టీ నేతలనే నమ్మడం లేదు..
వివేక్ చెన్నూరులోని కాంగ్రెస్ పార్టీ నేతలనే నమ్మడం లేదనే విమర్శలున్నాయి. వారి చుట్టూ తన అనుచరులు, బంధువులు, పీఏలు ఇలా అందరినీ మోహరించి తన గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నూరుకు చెందిన ఓ పెద్ద నేత ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులను ఉంచారు. ఆ నేత ఏది మాట్లాడాలన్నా..? ఏం చేయాలన్నా..? తన వద్ద వచ్చే వారిని కలవాలన్నా..? వారి ఇద్దరి ఎదుటే కలవాలి. ఏది ఉన్నా అన్నీ వారి ముందే. పేరుకు మాత్రం ఆయనకు సహాయంగా వారిని పంపించినా ఎప్పటికప్పుడు తమ నేత వివేక్ ఇక్కడి విషయాలన్నీ చేరవేస్తున్నారు. తనకు కనీసం ప్రైవసీ లేకుండా ఇదేంటని ఆ నేత వాపోతున్నారట. చాలా మంది నేతలది ఇదే పరిస్థితి అని సమాచారం. కానీ, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారంతా గప్చిప్గా ఉంటున్నారు.

ప్రేంసాగర్ వర్గంగా ముద్రవేస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న తాము పరాయి అయ్యాయమని కొందరు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే వివేక్ సమావేశం ఏర్పాటు చేసి అందరు నేతలతో మాట్లాడకుండా ఆయన ఒంటెద్దు పోకడలు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పార్టీలో కొందరు నేతలను ప్రేంసాగర్ రావు వర్గంగా ముద్ర వేసి తమను దూరం చేశారని కొందరు నేతలు వాపోతున్నారు. తనకు దగ్గర ఉన్న వారికే మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవడం లేదని పలువురు నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. కొద్ది రోజులుగా వివేక్ వర్గం, ప్రేంసాగర్ రావు వర్గాల మధ్య వర్గపోరు సాగుతోంది. కొందరు నేతలు వివేక్పై చేసిన వాటప్స్ లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

పార్టీ ఎందుకు మారాం రా..? భగవంతుడా..
మరోవైపు, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిన నేతలంతా పార్టీ ఎందుకు మారామని మదనపడుతున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలు బీఆర్ఎస్ నేతలు వివేక్ ను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ నడుస్తున్న వర్గపోరుతో పాటు, తమని నమ్మని నేతలతో ఏం చేయాలో పాలుపోక డైలామాలో పడ్డారు. తమను నమ్మి ప్రజాప్రతినిధులను చేసిన బీఆర్ఎస్ పార్టీని కాదని ఇక్కడకు వస్తే అటు ప్రజల నుంచి వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ సరైన గుర్తింపు లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉందని పలువురు నేతలు వాపోతున్నారు. మరి ఆ నేతలు ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

వివేక్ సొంత పార్టీ నేతలను నమ్మకుండా తన కంపెనీ ఉద్యోగులు, బంధుగణం, చివరకు తన సొంత మీడియాలో పనిచేస్తున్న వారిని సైతం ఎన్నికల్లో వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల కిందట చెన్నూరుకు రూ. 50 లక్షలు తరలిస్తుండగా వివేక్ కంపెనీకి చెందిన వ్యక్తితో పాటు వెలుగు పత్రిక ఉద్యోగి ఒకరిని అరెస్టు చేయడం ఇందుకు ఉదాహరణ చెబుతున్నారు. తమను నమ్మని వ్య‌క్తికి తామేందుకు పనిచేయాలనే అంశంపై సైతం కొందరు నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఏం చేస్తారో..? వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like