వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఐదేండ్లే…

-జేబీసీసీఐ చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందం
-త‌దుప‌రి చ‌ర్చ‌లు ఏప్రిల్‌కు వాయిదా

మంచిర్యాల : ప‌ద‌కొండ‌వ వేజ్‌బోర్డు ప‌రిష్కారం కోసం జ‌రిపిన చ‌ర్చ‌ల్లో కొంత పురోగ‌తి వ‌చ్చింది. వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఐదేండ్లుగా ఉంచేందుకు కోల్ఇండియా యాజ‌మాన్యం అంగీకారం తెలిపింది. మొద‌ట వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఖ‌చ్చితంగా ప‌దేండ్లు ఉండాల‌ని యాజ‌మాన్యం కోరింది. ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌దేండ్లు ఉండాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. చాలా చోట్ల ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్లలో ప‌ది సంవ‌త్స‌రాలు మాత్ర‌మే కాల‌ప‌రిమితి ఉంద‌ని జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకువ‌చ్చింది. న‌వ‌ర‌త్న కంపెనీల‌లో కూడా ప‌ది సంవ‌త్స‌రాలు ఉన్నందున డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కోల్ ఇండియా యాజ‌మాన్యం తేల్చిచెప్పింది.

అయితే ఈ విష‌యంలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. సింగరేణి తో పాటు బొగ్గుగని కార్మికులు అందరికీ ఐదు సంవత్సరాలు మాత్రమే వేజ్ బోర్డు కాలపరిమితి గా ఉండాలని తేల్చి చెప్పాయి. ఈ సంద‌ర్భంగా కోల్ ఇండియా యాజమాన్యం కార్మిక సంఘాలు చెప్పిన డిమాండ్లు యథాతధంగా అంగీకరిస్తే యాజమాన్యం పై పడే ఆర్థిక భారంపై వివ‌రించారు. అయినా కార్మిక సంఘాలు ఐదు సంవత్సరాల వేజ్ బోర్డు కి అనుమతి ఇస్తే మాత్రమే చర్చలు జరుపుతామని ప్రకటించారు. దీనితో ఎట్టకేలకు కోల్ ఇండియా యాజమాన్యం ఐదు సంవత్సరాల కాల పరిమితితో వేజ్ బోర్డు పై చర్చలు జరపడానికి అంగీకరించింది.

జీతభత్యాలు, పదోన్నతులు, సీపీఆర్ఎంఎస్ఎన్ఈ మొదలగు అంశాల మీద సబ్ కమిటీలు వేయాలని యాజమాన్యం పేర్కొన్నది. దానికి కూడా అన్ని జాతీయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతే కాకుండా ఈ విభజించి పాలించాలనే పాలసీని మానుకోవాలని కోరారు. డిపార్టుమెంటు అఫ్ పబ్లిక్ ఎంటర్పరైజేస్ నిబంధ‌న‌ల ప్రకారం ఎగ్జిక్యూటివ్స్ బేసిక్ కంటే ఎన్‌సీడ‌బ్ల్యూఏ ఉద్యోగుల బేసిక్ తక్కువ ఉండాలని యాజమాన్యం పేర్కొన్నది. దానికి కూడా సంఘాల నేత‌లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమావేశంలో కేవలం వేజ్ బోర్డు కాలపరిమితి గురించి మాత్రమే మాట్లాడారు. తదుపరి చర్చలు ఏప్రిల్ 2022 నెల కు వాయిదా వేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like