కేరళలో జల విలయం

రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు ఆదుకుంటామని కేంద్రం హామీ ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్ష సూచన  బద్రీనాథ్‌ యాత్ర నిలిపివేత

 

కొట్టాయం, అక్టోబరు 17: కేరళలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. కొట్టాయం జిల్లాలో 13, ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అళప్పుఝ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొట్టాయంలోని కూచ్చికల్‌లో ఐదు మృతదేహాలను వెలికితీశారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామని కొట్టాయం జిల్లా కలెక్టర్‌ పీకే జయశ్రీ తెలిపారు. మలప్పురం, అళప్పుఝ, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, పథనంతిట్ట, పాలక్కడ్‌, కొట్టాయం, కన్నూర్‌, కొల్లం, ఇడుక్కి జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను తరలించారు. మొత్తం 11 జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆపత్కాలంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో మూడురోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బద్రీనాథ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. పాండుకేశ్వర్‌లోని యాత్రికులను ఆదివారం చమోలీ వద్ద అధికారులు నిలిపేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. అలాగే, జోషిమఠ్‌ వద్ద కూడా యాత్రికులను నిలిపివేశారు. వర్షాలు తగ్గే వరకు యాత్ర కొనసాగించవద్దని చెప్పారు. ఇక ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా సహాయక బృందాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like