మేము వ‌స్తాం… ఇండ్లిస్తాం…

-స్థ‌లం ఉంటే ఇల్లు క‌ట్టుకునేందుకు రూ. 5 ల‌క్ష‌లు
-కౌలు రైతుల కోసం ప్ర‌త్యేక ప‌థ‌కం
-మోతుగూడ గ్రామ‌స్తుల‌కు భ‌ట్టి హామీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, తాము అధికారంలోకి రాగానే పేద‌ల‌కు ఇండ్లిస్తామ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. ఆయ‌న పాద‌యాత్ర‌లో భాగంగా ఆసిఫాబాద్ మండ‌లం మోతుగూడ చేరుకున్నారు. ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు గ్రామ‌స్తులు మాట్లాడుతూ పాద‌యాత్ర చేస్తూ వ‌స్తున్న మీకు దండాలు.. మా తండ్రిలా వ‌చ్చారని అన్నారు. మాకు రేష‌న్ కార్డులు లేవు.. ఉండ‌నీకి ఇండ్లు లేవని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భూమి ఉన్నోళ్లకు మాత్ర‌మే రైతుబంధు ఇస్తున్నారని, మాలాంటి కౌలు రైతుల బ‌తుకులు ద‌య‌నీయంగా మారాయ‌ని భ‌ట్టి ఎదుట వాపోయారు. రేష‌న్ కూడా స‌రిగ్గా రావ‌డం లేదంటూ త‌మ బాధ‌ను వెళ్ల‌బోసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ త్వ‌ర‌లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డుందని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అప్పుడు అంద‌రికీ ఇండ్లు వ‌స్తాయని అన్నారు. స్థ‌లం ఉన్న‌వారికి ఇండ్లు క‌ట్టుకునేందుకు రూ. 5 ల‌క్ష‌లు ఇస్తామ‌ని, రేష‌న్ కార్డులు సైతం ఇస్తామ‌ని వెల్ల‌డించారు. కౌలు రైతుల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా ఒక ప‌థకాన్ని తీసుకువ‌స్తామ‌ని భ‌ట్టి మోతుగూడ గ్రామ‌స్తుల‌కు హామీ ఇచ్చారు.

ఉద‌యం నుంచి సంకల్ప దీక్ష..
అంత‌కుముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ భట్టి విక్రమార్క సంకల్ప దీక్ష చేప‌ట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్, ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఉద‌యం నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు సంక‌ల్ప‌దీక్ష‌లో కూర్చున్నారు. ఈ దీక్ష‌కు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. సంకల్ప దీక్షలో ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, పీసీసీ జనరల్ సెక్రటరీ సరస్వతి, పీసీసీ సభ్యులు గణేష్ రాథోడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like