సీత‌క్క‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాం

Revanth Reddy:కాంగ్రెస్ పార్టీ అంద‌రికీ అవ‌కాశాలు ఇస్తుంద‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని వెల్ల‌డించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప‌లు అంశాల‌పై ఎన్నారైలు రేవంత్‌రెడ్డికి ప్ర‌శ్న‌లు సంధించారు. దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. పార్టీని, తనను వేరు చేసి చూడొద్దని, తెలంగాణలో కాంగ్రెస్సే రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ తీసుకున్న‌ నిర్ణయానికి అనుగుణంగా అందరం కలిసి పని చేస్తామన్నారు. పోలవరం, అమరావతిని కట్టేది కాంగ్రెస్ పార్టీనే అని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల కోసం ఏదైనా చేస్తామని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నిత్యం శ్రమిస్తూనే ఉంటాడన్నారు. ప్రతి నిమిషం పార్టీ కోసమే పనిచేస్తానని ఈ సంద‌ర్భంగా రేవంత్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like