స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఏంటి?

Skill Development Scam: చంద్ర‌బాబు అరెస్టు నేప‌థ్యంలో మ‌రోసారి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కొద్ది సేప‌టి కింద‌ట సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయ‌న‌ను విజ‌య‌వాడ త‌ర‌లిస్తున్నారు. ఆయ‌న స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్నాడు. ఇంత‌కీ ఈ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం ఏమిటి..? తెర వెన‌క అసలు ఏం జ‌రిగింది..?

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెండు నెల‌ల‌కు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం తెచ్చారు. యువ‌త‌కు కంప్యూట‌ర్ త‌దిత‌ర అంశాల్లో శిక్ష‌ణ ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్య‌త వెలికితీయ‌డం, వారికి ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చేలా చేయ‌డం దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీం ఖర్చు మొత్తం రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అనీ, 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుకుంటుందని ముఖ్య‌మంత్రి చంద్రబాబు చెప్పారు. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల రూపాయలు సీమెన్స్‌ ఇస్తుంది. రూ. 371 కోట్ల మేర రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయాలి. అయితే ఇక్క‌డే పెద్ద ఎత్తున స్కాం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వెలువ‌డ్డాయి.

సీమెన్స్‌ నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా రావాల్సిన డ‌బ్బులు రాలేదు. కానీ, 5 దఫాలుగా ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ డ‌బ్బు విడుదలైందనే వాదన ఉంది. ఇంత డ‌బ్బు విడుద‌ల అయినా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్య‌క్ర‌మాలు ఏమీ జ‌ర‌గ‌లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ. 371 కోట్లను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ. 371 కోట్లలో రూ. 240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ వ్యవహరాన్ని ఈడీ దృష్టికి కూడా తీసుకెళ్లగా వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

దాదాపు రూ.240 కోట్లు షెల్ కంపెనీల‌కు మ‌ళ్లించిన‌ట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 370 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్‌ కంపెనీలకు మళ్లించిన‌ట్టు సీఐడీ అధికారులు నిగ్గుతేల్చారు. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. అప్పుడు సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ క‌న్విక‌ర్ ద్వారా కుంభ‌కోణం న‌డిపించిన‌ట్టు సీఐడీ విచార‌ణ‌లో వెలుగుచూసింది.

ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామునే విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like