అధిష్టానం పిలుపు వెన‌క ఆంత‌ర్య‌మేంటి..?

Durgam Chinnayya: ఎన్నిక‌ల వేళ ఏది జ‌రిగినా అది సంచ‌ల‌న‌మే… ఎందుకంటే రాజ‌కీయంగా ప్ర‌తి అంశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంటుంది కాబ‌ట్టి.. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్యకు టిక్కెట్టు వ‌స్తుందా…? రాదా అనేది పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది…? కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు టిక్కెట్టు కేటాయిస్తు అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది.అయితే, ఇప్పుడు మ‌రో చ‌ర్చ సాగుతున్న వేళ దుర్గం చిన్న‌య్య‌కు తెలంగాణ భ‌వ‌న్ నుంచి ఫోన్ కాల్ రావ‌డం ఆయ‌న హుటాహుటిన హైద‌రాబాద్ వెళ్ల‌డం ప‌ట్ల మ‌ళ్లీ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

దుర్గం చిన్న‌య్య ఇప్పుడు ఈ పేరు రాష్ట్రవ్యాప్తంగా సుప‌రిచిత‌మే. త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని షేజ‌ల్ అనే యువ‌తి రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేసింది. దీంతో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య పేరు మారుమోగిపోయింది. ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని షేజ‌ల్ ఎక్క‌ని గ‌డ‌ప లేదు.. దిగ‌ని గ‌డ‌ప లేదు అన్న‌ట్లుగా హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్ నుంచి మొద‌లు పెట్టి దేశ రాజ‌ధాని ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు చేస్తూ పోయింది. ఇప్ప‌టికే రెండు సార్లు గెలిచిన దుర్గం చిన్న‌య్య‌కు ఈసారి టిక్కెట్టు ఖ‌చ్చితంగా రాద‌ని ప‌లువురు అంచనాకు వ‌చ్చారు. కానీ, అధిష్టానం ఆయ‌న‌కే టిక్కెట్టు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కొద్ది రోజులు కింద‌ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన జాబితాలో ఆయ‌న పేరుంది.

అయితే, బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆయ‌న‌కే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ బీఫాం ఇచ్చే స‌మ‌యంలో మాత్రం ఆయ‌న‌కు ఇవ్వ‌కుండా వేరే వారికి ఇస్తారంటూ ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మయంలో మీడియాలో సైతం వార్త‌లు వ‌చ్చాయి. అదంతా ఉత్త‌దేనంటూ దుర్గం చిన్న‌య్య అనుచ‌ర‌వ‌ర్గం కొట్టి పారేస్తోంది. త‌మ వ్య‌తిరేక వ‌ర్గంతో పాటు, మిగ‌తా వ్య‌తిరేక పార్టీలు ఇలా ప్ర‌చారం చేస్తున్నాయ‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ నేత‌కే టిక్కెట్టు వ‌స్తుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే గెలుపంటూ వారు ప్ర‌చారం చేసుకుంటున్నారు. చిన్న‌య్య విజ‌యోత్స‌వ ర్యాలీ సైతం పెద్ద ఎత్తున చేసి స‌త్తా చాటారు.

ఇదంతా జ‌రుగుతున్న క్ర‌మంలోనే ఈరోజు హ‌ఠాత్తుగా దుర్గం చిన్న‌య్య‌కు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్ నుంచి పిలుపు వ‌చ్చింది. బీసీ బంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నాల్సి ఉన్న చిన్న‌య్య హుటాహుటిన హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌య్యారు. దీంతో ఆయ‌న అంత అర్జంటుగా హైద‌రాబాద్ వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింద‌నే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. చిన్న‌య్య‌కు బీఫాం ఇవ్వ‌కుండా న‌చ్చ‌జెప్ప‌డానికే పిలిపించార‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ నేత వినోద్ బీఆర్ఎస్ చేర‌తార‌ని ఆయ‌న‌కు టిక్కెట్టు ఇచ్చేందుకు మంత‌నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో బెల్లంప‌ల్లి టిక్కెట్టు వినోద్‌కు కేటాయించి చిన్న‌య్య‌కు రాజ‌కీయంగా ఏదైనా స్థానం క‌ల్పించే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇలా ర‌క‌ర‌కాలైన ప్ర‌చారాల నేప‌థ్యంలో దుర్గం చిన్న‌య్య‌కు అధిష్టానం నుంచి పిలుపు రావ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. కానీ, చిన్న‌య్య అనుచ‌రులు మాత్రం అదే భ‌రోసాతో ఉన్నారు. త‌మ నేత‌కే టిక్కెట్టు వ‌స్తుంద‌ని అందులో ఏ మాత్రం అనుమానం లేద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో త‌మ నేత గెలుస్తాడ‌ని మ‌రోమారు ధీమాతో చెబుతున్నారు. చివ‌ర‌కు ఏం జరుగుతుంద‌న్న‌ది మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like