అందుబాటులో ఉంటారా..? అభివృద్ధి చేస్తారా..?

గ‌డ్డం వినోద్‌, వివేక్ బ్ర‌ద‌ర్స్ వీరిద్ద‌రూ ఎన్నిక‌ల్లో గెలిచారు.. స‌రే.. ఇప్పుడు బెల్లంప‌ల్లి, చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మెదులుతున్న ప్ర‌శ్న ఒక్క‌టే.. వీరు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారా..? నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారా..? అని. తాము స్థానికంగా ఉంటామ‌ని, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి, అభివృద్ది చేస్తామ‌ని వీరిద్ద‌రూ హామీ ఇచ్చారు. మ‌రి వారి హామీ ఏ మేర‌కు నెర‌వేరుతుందోన‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు..

గ‌డ్డం వినోద్.. గ‌తంలో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయినా, ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌నే అప‌వాదు ఉంది. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో మొన్న‌టి వ‌ర‌కు బ‌స్టాండ్ కూడా దిక్కులేని దుస్థితి. ఇక, గ్రామీణ ప్రాంతాల గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. ఆయా గ్రామాల‌కు రోడ్లు, ర‌వాణా వ్య‌వ‌స్థ చాలా ద‌య‌నీయ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ఉండేవి. వినోద్ మంత్రిగా ఉండి కూడా త‌న ప్రాంతానికి ఏం చేయ‌లేద‌ని, స్థానికంగా ఉండ‌కుండా క‌నీసం ప్ర‌జ‌ల‌కు సైతం అందుబాటులో లేకుండా పోయార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక వివేక్‌ది కూడా అదే ప‌రిస్థితి. ఆయ‌న పెద్ద‌పల్లి ఎంపీగా గెలిచినా కేవ‌లం హైద‌రాబాద్ కే ప‌రిమితం అయ్యారు. ఎంపీగా రైళ్ల నిలుపుద‌ల‌, చిన్న చిన్న ప‌నులు మిన‌హా ఆయ‌న ఇక్క‌డి అభివృద్దికి పెద్ద‌గా చేసింది ఏమీ లేద‌ని స్థానిక ప్ర‌జ‌లే పెద‌వి విరిచే ప‌రిస్థితి.

ఇప్పుడు వినోద్ బెల్లంప‌ల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నిక‌ల్లో త‌న‌కు వ్య‌తిరేక రాకుండా ఉండేందుకు తాను ఇక్క‌డే ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. అంతేకాకుండా, మూడు నెల‌ల్లో ఇల్లు క‌ట్టుకుంటాన‌ని సైతం హామీ ఇచ్చారు. ఆయ‌న హామీ ఇవ్వ‌డ‌మే కాకుండా అగ్రిమెంట్ సైతం రాసిచ్చారు. ఆయ‌న కూతురు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న తండ్రి ఇక్క‌డే ఉండేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానికంగా ఉండి, నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారిస్తారా..? లేక కేవ‌లం ఎన్నిక‌ల హామీగానే మిగిలిపోతుందా…? అనే విష‌యంలో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అదే స‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి ప‌నుల‌ను సైతం ఆయ‌న ప‌రిష్క‌రించాల్సి ఉంద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు.

వేల కోట్ల వ్యాపారాలు ఉన్న వివేక్ చెన్నూరులో ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండే అవ‌కాశం లేదు. ఆయ‌న ఖ‌చ్చితంగా హైదరాబాద్‌కే ప‌రిమితం అవుతారు. క‌నీసం ఆయ‌న అభివృద్ధి విష‌యంలోనైనా ఈసారి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేయాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా.. గ‌తంలో ప్ర‌భుత్వ విప్ వంద‌ల కోట్ల‌తో ఇక్క‌డ చాలా అభివృద్ధి ప‌నులు చేశారు. వాట‌న్నింటికి కొన‌సాగింపుతో పాటు కొత్త‌గా చాలా ప‌నులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాణ‌హిత‌, గోదావ‌రి తీర ప్రాంతాల్లో ముంపున‌కు గుర‌వుతున్న భూముల‌ను కాపాడాలి. తీరంలో క‌ర‌క‌ట్ట నిర్మాణం అయినా చేయాలి.. లేదా మునిగిపోతున్న భూముల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి ప్ర‌భుత్వ‌మే వాటిని కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన విధంగా ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాలి.

మ‌రి గ‌డ్డం బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారా..? అభివృద్ధి చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like