యాదమ్మ వండాలే… మోదీ తినాలే..

-బీజేపీ స‌మావేశాల్లో తెలంగాణ రుచులు
-క‌రీంన‌గ‌ర్‌కు చెందిన యాద‌మ్మ చేతి వంట‌లు ప్ర‌త్యేకం
-ప్ర‌త్యేకంగా మోను త‌యారు చేసిన బీజేపీ నేత‌లు

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ దేశాధినేత‌… ఆయ‌నకు వండించే వంట‌కాలు ఎలా ఉంటాయి ఒక‌సారి ఊహించుకోండి.. ప్ర‌త్యేకంగా త‌ర్ఫీదు పొందిన వంట‌గాళ్లు.. ఆయ‌న రుచికి, ఆరోగ్యానికి స‌రిప‌డా వంట‌లు చేయిస్తారు. కానీ హైద‌రాబాద్ నిర్వ‌హించనున్న బీజేపీ స‌మావేశాల్లో ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడ‌బోతున్నారు. దీని కోసం ప్ర‌త్యేకంగా ఓ టీంను సైతం ఏర్పాటు చేశారు.

గూళ్ల యాద‌మ్మ‌ ముప్పై ఏండ్లుగా వంట‌లు చేస్తూ జీవిస్తున్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఆమె చేతి వంట రుచి చూడ‌ని నేత లేడంలే అతిశ‌యోక్తి లేదు. ఏకంగా 10 వేల మందికి సైతం సులువుగా, రుచికరంగా వండి పెట్టేయగల నేర్పరిగా యాదమ్మకు పేరుంది. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ కార్యక్రమాలతో పాటు బండిసంజయ్‌ నిర్వహించిన సమావేశాల్లోఈమెనే వంటలు చేసి పెట్టేది. ఆమె చేతి తెలంగాణ రుచులను తిన్న వారి ద్వారా ప్రశంసలు దక్కాయి. అలా మంచి గుర్తింపు వచ్చింది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా ఫేమస్ అయ్యాయి.

తెలంగాణ వంట‌ల‌ను ప్ర‌ధానికి రుచి చూపించాల‌నే ఉద్దేశంతో బీజేపీ నేత‌లు ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ బండి సంజ‌య్ ఆమెను హైద‌రాబాద్ పిలిపించారు. త‌న‌తో కొన్ని వంట‌కాలు చేయించారు. చాలా మంది చెఫ్‌లు, కొంద‌రు బీజేపీ ముఖ్య నేత‌లు వాటిని రుచి చూశారు. నోవాటెల్ హోటల్‌లో చెఫ్‌లతో కలిసి వంటలు చేయాల్సిందిగా యాదమ్మను కోరారు. సమావేశాల్లో రెండో రోజు పూర్తి శాఖాహార వంటకాలు చేయాలని యాదమ్మతో చెప్పారు. చివ‌ర‌కు రెండు రోజులు నిర్వ‌హించే ఈ స‌మావేశాల్లో తెలంగాణ వంట‌కాల‌ను రుచి చూపించ‌బోతున్నారు.

వీట‌న్నింటిలో యాద‌మ్మ చేతుల మీదుగా పులిహోర,పప్పన్నం,దద్దోజనం,బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూరపప్పు, పచ్చిపులుసు,సాంబారు,గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతారు. సకినాలు,సర్వపిండి,అరిసెలు,భక్షాలు, పాయసం,పప్పుగారెలు,బూందిలడ్డు చేయ‌నున్నారు. ‘మోడీ సారు తెలంగాణ వంటకాలు గురించి అడిగారట. మా బండి సంజయ్ సారు.. మా యాదమ్మ మంచి రుచికరమైన వంటకాలు అని చెప్పారట. నేను చేసిన వంట మోదీ సార్ తింటానంటే అంత‌కంటే భాగ్యం ఏముంటుంద‌ని యాదామ్మ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

తాము ఎంచుకున్న రంగం ఏదైనా ఇష్టంగా ప‌నిచేస్తే ఇలాంటి ఫ‌లితాలే ఉంటాయ‌నడానికి యాద‌మ్మ జీవిత‌మే ఒక స్ఫూర్తి. త‌న వంట‌ల ద్వారా ఎంతో మందిని మెచ్చింపి, ఒప్పించిన యాద‌మ్మ చివ‌ర‌కు ఈ దేశ ప్ర‌ధానికే త‌న వంట‌లు రుచి చూపించ‌బోతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like