అవి యాజ‌మాన్య హ‌త్య‌లే..

భ‌యం భ‌యంగా బండ‌కింద బ‌తుకులు - ర‌క్ష‌ణ ప‌ట్ల ఏ మాత్రం శ్ర‌ద్ధ లేని అధికారులు - తాన‌తందాన కార్మికుల సంఘాల‌తో కార్మికుల‌కు ఇబ్బందులు

(నాంది న్యూస్ బ్యూరో)

మ‌న వెలుగుల కోసం వారు చీక‌ట్లో మ‌గ్గుతున్నారు… త‌మ ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి బొగ్గు ఉత్ప‌త్తి సాధిస్తున్నారు. వారు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ ప్రాణాల‌పై భ‌రోసా ఉండ‌దు. వారికి క‌నీస ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన యాజ‌మాన్యం వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు త‌ప్ప కార్మిక సంఘాలు కూడా ఏం చేయ‌డం లేదు.. దీంతో సింగ‌రేణిలో ప్ర‌మాదాలు.. కాదుకాదు యాజ‌మాన్య హ‌త్య‌లు నిత్య‌కృత్యం అయ్యాయి.

ఘనమైన చరిత్ర.. నిత్యం వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణిలో ప్రమాదాల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. రక్షణ చర్యలు అంతమాత్రంగానే ఉండడం వల్ల గనిలోకి వెళ్లే కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలో మారుతున్నాయి. యాజ‌మాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గనిలో ఉద్యోగం అంటేనే ప్రాణసంకటంగా మారింది. విధులకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవరకు భరోసా ఉండడం లేదు. గనిలో తరచూ జరిగే ప్రమాదాలు కార్మికులను అర్ధాయుష్కులును చేస్తున్నాయి.

అందుబాటులో ఉండ‌ని భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు..

సింగ‌రేణిలో ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఎన్నో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. పై వెనువెంట‌నే కూల‌డానికి ఆస్కారం ఉండ‌దు. దానికి ముందు ఎన్నో సంకేతాలు అందుతాయి. శ‌బ్దాలు రావ‌డం, పైక‌ప్పు కూల‌కుండా పెట్టిన దాట్లు వంగిపోవ‌డం, క‌న్వ‌ర్డెన్స్ మీట‌ర్లు కింద‌కు చూప‌డం, లోడ్ సెల్స్ సంకేతాలు అంద‌చేడ‌యం ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వీటిని నిశింత‌గా ప‌రిశీలించే యంత్రాంగం ఉండాలి. బొగ్గు, బండ పొర‌ల మ‌ధ్య ఎలాంటి తేడా వ‌చ్చినా గుర్తంచేందుకు హిడెన్ స్లిప్ డిటెక్ట‌ర్ అనే ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిపుణులు సూచించారు. అయినా దాని గురించి ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టించుకోలేదు.

ఆ రెండు శాఖ‌ల‌ నిర్లక్ష్యమే..?

సింగరేణి వ్యాప్తంగా రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు పటిష్టం చేయడానికి రెండు శాఖలు ప‌ని చేస్తాయి. డిఎంఎస్, డిడిఎంఎస్ ఎప్ప‌టిక‌ప్పుడు సింగ‌రేణి వ్యాప్తంగా ప‌ర్య‌టించి స‌ల‌హాలు, సూచ‌నలు అందించాలి. కానీ ఎక్క‌డా కూడా వీరు ప‌ర్య‌టించిన దాఖ‌లాలు లేవ‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక గ‌నుల వారీగా సేఫ్టీ క‌మిటీలు సైతం తూతూ మంత్రంగా ప‌నిచేస్తున్నాయి. ఈ క‌మిటీ స‌భ్యులు ప్ర‌తి నెలా గ‌నికి సంబంధించి ప‌ని స్థ‌లాల్లో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు ఎలా ఉన్నాయి..? ఇబ్బందులు ఉంటే వాటిని తొల‌గించేందుకు ఏం చ‌ర్య‌లు తీసుకోవాలి అనే విష‌యంలో చ‌ర్చించాలి. క‌మిటీ నాయ‌కులు కేవ‌లం ఉచితంగా మ‌స్ట‌ర్లు వేసుకునేందుకు త‌ప్పితే ర‌క్ష‌ణ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప‌ని ఒత్తిళ్లే అస‌లు కార‌ణం..

ఉత్ప‌త్తి ఉన్న శ్ర‌ద్ధ కార్మికుల ప్రాణాల మీద ఉండ‌టం లేదు. శ్రీ‌రాంపూర్‌లో ఎస్ఆర్‌పీ 3 గ‌ని ప్ర‌మాదానికి అధికారులే కార‌ణ‌మ‌ని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి నిన్న ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం రెండు, మూడు రోజుల కింద‌ట వ‌ర‌కు ప‌నులు ఆపేశారు. కొత్త‌గా ప‌నులు ప్రారంభించిన‌ప్పుడు అక్క‌డ ఓవ‌ర్‌మెన్‌, అండ‌ర్‌మేనేజ‌ర్ స్థాయి అధికారి ఉండాలి. ప‌ని ఒత్తిడి కార‌ణంగా అక్క‌డ సీనియ‌ర్లు ఎవ‌రూ లేకుండా పోయారు. దీంతో ఎలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు లేకుండానే వారు ప‌నిలోకి దిగాల్సి వ‌చ్చింది. ఇది ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యింది. ఉత్త‌త్తి కోసం ఎలాంటి చోట్ల‌నైనా ప‌నులు చేయిస్తుండ‌టంతో కార్మికులు త‌మ ప్రాణాల‌ను బ‌లి పెట్టాల్సి వ‌స్తోంది.

మ‌స్ట‌ర్ల కోసమే కార్మిక సంఘాల నేత‌లు..

కార్మికులు, వారి సంక్షేమం ప‌ట్టించుకోవాల్సిన కార్మిక సంఘాల నేత‌లు ఉచిత మ‌స్ట‌ర్ల కోస‌మే ప‌నులు చేస్తున్నారు. అధికారుల వ‌ద్ద త‌మ మాట చెల్లుబాటు అయ్యేందుకు, ఎప్పుడు ప‌డితే అప్పుడు వెళ్లిపోయేందుకు వారు ఏది చెప్పినా స‌రే అని ప‌ద్ద‌తికి మారిపోయారు. కార్మికుల‌కు క్వార్ట‌ర్లు ఇప్పించ‌డం, వారిని బ‌దిలీ చేయ‌డం అందుకు డ‌బ్బులు వ‌సూలు చేసుకోవ‌డం ఇదీ కార్మిక సంఘాల నేత‌ల ప‌రిస్థితి. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ఇప్ప‌టికైనా అటు సింగ‌రేణి యాజ‌మాన్యం, ఇటు కార్మిక సంఘ నేత‌లు చీక‌టి సూరీళ్ల ప్రాణాల కోసం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like