తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు షోకాజ్ నోటీసులు

Telangana Congress: కొంత కాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ హై క‌మాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుల గణన సర్వే తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేయడం, కులగణన ఫామ్ దగ్థంపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన‌ చేపట్టింది. అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మల్లన్న కులగణనను తప్పుబడుతూ విమర్శలు చేయడం ప్రజల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వేపై అనుమానాలను అపోహలను పెంచేసింది. కులగణన సర్వేకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ప్ర‌తిప‌క్షాల మాదిరిగానే విమ‌ర్శ‌లు..
కులగణన నివేదిక బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీలకు మేలు చేద్దామని ప్రభుత్వం చూస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు వారిపై ప్రతి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఈ కులగణన సర్వేకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు కూడా తీన్మార్ మల్లన్న చేస్తున్న కామెంట్స్‌తో.. రాష్ట్ర ప్రభుత్వం విమర్శల దాడిని మరింతగా పెంచుతున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులగణన సర్వే ప్రతులను తగలబెట్టారు. ఈ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిచడం లేదని.. బీసీల భవిష్యత్తు సమాధి చేసిన నివేదికగా భావిస్తున్నానని తీన్మార్ తెలిపారు. ఇది దొంగ లెక్క అని.. ఈ దొంగ లెక్కను బీసీలు సమర్ధించరని చెప్పుకొచ్చారు. 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేశారని.. బీసీలను అవమానపరిచిన ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. బీసీలకు న్యాయం చేయడానికి, రిజర్వేషన్లు కల్పించేందుకు లెక్కలు తీయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్థమైందని అన్నారు.

రెడ్డిల‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లు
హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో సంచలన వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌. రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అన్నారు. రెడ్లపై అనుచిత కామెంట్స్ చేశారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనపైనా సంచలన కామెంట్స్ చేశారు. బీసీ కులగణన తప్పుల తడక అని.. బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగే సూచనలు లేవని.. సర్వే నివేదిక పత్రులను తగులబెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వం దొంగ సర్వేకు నిరసనగా కులగణన సర్వే పేపర్లను తగలబెడుతున్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాహుల్ గాంధీ మాటలను వ్యతిరేకిస్తున్నాడా? కాంగ్రెస్ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం అని… ఎంతటివారైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం.. బాధగా ఉంది: సీతక్క
మలన్న వ్యవహార శైలిపై మంత్రి సీతక్క సైతం సీరియ‌స్ అయ్యారు. మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని అందుకు బాధగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా? కాదా? అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలన్నారు. కులగణన సర్వే సరిగా లేదని మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కులగణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడటం, వాటిని కాల్చివేయం మంచిది కాదని హితవు పలికారు. మల్లన్న సంగతి పార్టీనే చూసుకుంటుందన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దీనిని అడ్డుకోవాలనే కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీల లెక్క 56 శాతానికి పైగా తేలిందని.. ఎక్కడా ఎవరికీ కూడా నష్టం జరగలేదన్నారు. మేక వన్నె పులిలా బీఆర్ఎస్ నేతలు బీసీల హక్కులను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like