కోనేరు కోనప్ప రాజీనామా
Koneru Konappa: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే ఆయన రాజీనామా చేశారు. నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం పట్ల మాజీ సీఎం కేసీఆర్‌తో విభేదించారు. గత ఏడాది మార్చిలో ఆయన బీఆర్ ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై కోనప్ప విజయం సాధించారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఏడాది గడవకుండానే కోనప్ప హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఇటీవలే తన నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. కాంగ్రెస్‌ను దొంగల గుంపుగా విమర్శించారాయన. ఈ విషయంపై రేవంత్ రెడ్డితో మాట్లాడినా ఎలాంటి హామీ లభించలేదని, ఫలితంగా వారం రోజుల కిందటే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పుడాయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం కోనప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని విమర్శించారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్‌ను రద్దు చేయడం దారుణంగా అభివర్ణించారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. స్వతంత్రంగా ఉంటానని కోనప్ప ప్రకటించారు.