పాతబస్తీలో పోలీసుల స్పెషల్ ఆపరేషన్

పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మఫ్టీలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఎనిమిది మందికి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. సీసీటీవీలతో నిరంతర నిఘా కొనసాగించారు పోలీసులు.

పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నేరాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో పండుగ జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో విస్తృతంగా నిఘా చేపట్టారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు.. నిష్క్రమణ మార్గాలు.. రద్దీ ప్రాంతాలు.. నేరాలకు ఆస్కారం ఉన్న సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో గతంలో నేరాలకు పాల్పడినవారు.. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు.. ఆస్తుల నేరాల్లో ప్రమేయం ఉన్న వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన 116 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిలో ఎనిమిది మందికి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. వారిని తదుపరి చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 100 సీసీటీవీ కెమెరాల ద్వారా పండుగ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించారు. సుమారు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక నేర బృందాలు.. స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయడంతో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పండుగ పరిసర ప్రాంతాల్లో సెల్‌ఫోన్ చోరీలు, గొలుసు దొంగతనాల వంటి ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం. శ్రీనివాస్ వెల్లడించారు.

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు ప్రశాంతంగా సాగాయి. నేరాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక బృందాల నిఘా, మఫ్టీ పోలీసుల తనిఖీలు సత్ఫలితాలను ఇచ్చాయని పోలీసులు తెలిపారు.

You might also like