రాజలింగం హత్యకు కారణమిదే..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్-భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally) కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి (Nagavelli Rajalingamurthy) హత్య కేసు లో చిక్కుముడి వీడింది. హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పది మంది పాల్గొనగా, ఇప్పటి వరకు ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేశారు. ఆ కేసు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్న తరుణంలోనే ఈ నెల 19న దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు కండ్లలో కారం కొట్టి ఆయనను కత్తులతో నరికివేశారు. దీంతో తెలంగాణలో ఈ హత్య సంచలనం సృష్టించింది. రాజకీయంగా కూడా కాకరేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రాజలింగం కేసు వేశారు కాబట్టి ఆయనను బీఆర్ఎస్ హత్య చేయించిందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారడంతో పోలీసులు సైతం అదే స్థాయిలో దర్యాప్తు చేశారు. రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు.
భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమికి సంబంధించి రాజలింగమూర్తికి హత్యలో ప్రధాన ముద్దాయి అయిన రేణికుంట్ల సంజీవ్ అనే వ్యక్తికి మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇద్దరూ కోర్టుకు సైతం వెళ్లారు. సంజీవ్ కుటుంబ సభ్యుల నుంచి అక్రమంగా రాజలింగమూర్తి భూమి కాజేశాడని వారు కక్ష పెంచుకున్నారు. సంజీవ్ మరికొందరు కలిసి రాజలింగమూర్తిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న రాజలింగంను వెంబడించిన నలుగురు వ్యక్తులు అతని కండ్లలో కారం కొట్టి కత్తులతో పొడిచి రాడ్డుతో కట్టి చంపేశారు. శనివారం సాయంత్రం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో రేణికుంట్ల సంజీవ్, పింగళి సేమంత్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసారపు కృష్ణ, రేణికుంట్ల సాంబయ్య అనే ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
హత్యలో బీఆర్ఎస్ నేత కూడా..
ఈ హత్యలో బీఆర్ఎస్ నేత కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. ఆయనతో పాటు పుల్లా నరేష్, పుల్లా సురేష్ పరారీలో ఉన్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా, వారిని రిమాండ్ తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. ఇతర కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఆరు బృందాలతో కలిసి పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు.