మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన..
CM Revanth Reddy: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈ నెల 25న ప్రచారం ముగియనుండగా 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలు పర్యటించనున్నారు. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తుండగా, 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన పర్యటన ఖరారయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, చేకూర్చిన లబ్ధి, భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలు వివరించి పట్టభద్రుల్లో పార్టీపై మరింత సానుకూలత సాధించే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన రూపొందించుకున్నారని సమాచారం. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొంటారు.
ఇందూరులో ఆత్మీయ సమ్మేళనంలో..
ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి ఇందూరుకు వస్తారు. 11.45 నిమిషాలకు చేరుకునే ఆయన 11.50 నుంచి 1.30 వరకు నగరంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. 1.35కి ఇందూరు నుంచి బయల్దేరి మంచిర్యాల వెళ్తారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పట్టణంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కాకపోయినా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మంచిర్యాలలో కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో..
మంచిర్యాల జిల్లాకు 2.15కు చేరుకునే ముఖ్యమంత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ కూడా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. ఆయన సభ విజయవంతం చేసేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎస్సారార్ కళాశాల మైదానంలో..
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి, పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేలా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని రాబోయే మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషిచేసేలా వ్యూహం రూపొందించి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.