64 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh 2025: సమస్త జగతికి ఆశీర్వచనాలు అందించే సనాతన ధర్మ వేడుక…! మహా కుంభమేళ.. సమస్త జగతికి సకల శుభాలను అందించే శక్తి సనాతన ధర్మ ఉపాసన సొంతం.. భక్తజన కోటి విశ్వాసంతో ఆచరించే అమృత స్నానం మన చారిత్రక వైభవ మహత్యానికి సాక్ష్యం.. సనాతన ధర్మ ఉపాసనలో ప్రతి కార్యం నిత్య ఆధునీకరం నిత్య సజీవం నిత్య నూతనం…! అలాంటి మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి భారీగా భక్తజన సందోహం తరలివచ్చారు.. ఇప్పటి వరకు 64 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు…
ఒక కోటి.. రెండు కోట్లు.. పది కోట్లు… ఇరవై కోట్లు.. కోట్ల సంఖ్యను దాటుతూ వెళ్లింది కుంభమేళాలో భక్తుల సంఖ్య… ఇప్పటి వరకూ కుంభమేళాలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 64 కోట్ల అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య సోమవారం నాటికి 64 కోట్లు దాటింది. ఈ సంఖ్య భారత్ చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఎక్కువే. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే. మహాకుంభమేళా మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో భక్తుల సంఖ్య తగ్గుతుందనుకుంటే విపరీతంగా పెరుగుతోంది. త్రివేణి సంగమంలో మిగతా రెండు రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. బుధవారం పవిత్ర శివరాత్రి కావడంతో మరింతగా భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానమాచరించారని తెలిపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చారని, దీనిని “శతాబ్దపు అరుదైన సంఘటనలలో ఒకటి” అని అభివర్ణించారు. ఒక నిర్దిష్ట సమయంలో ఇలా జనం గుమిగూడడం “అరుదైన” సంఘటన అని సీఎం యోగి తెలిపారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.