టన్నెల్ సహాయక పనుల్లో సింగరేణి అవిశ్రాంత కృషి
-ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో సింగరేణి రెస్క్యూ బృందాలు
-ట్రాక్ పై నిలిచిన బురద మట్టిని కూడా వేగవంతంగా తొలగిస్తున్న బృందాలు
-250 మంది రెస్క్యూ సిబ్బంది 4 షిఫ్ట్ లుగా పనులు
-అత్యాధునిక గ్యాస్ కట్టర్స్ ను వినియోగిస్తున్న సింగరేణి రెస్క్యూ బృందాలు
-సింగరేణి సీఎండీ బలరామ్ సాహసోపేత నిర్ణయం
-సింగరేణి బృందాలకు తోడుగా సొరంగ మార్గంలో రెస్క్యూ చర్యల పర్యవేక్షణ
Singareni: ఎస్ఎల్ బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. సింగరేణి రెస్క్యూ సిబ్బంది అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాలతో ఇనుప పైపులు, గడ్డర్లను కత్తిరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం.. దీంతో సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకుని ఉన్న బురద మట్టిని కూడా తొలగిస్తున్నారు. మొత్తం 250 మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24 గంటలు ఈ పనిలో పాల్గొంటున్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ ఇచ్చిన పనిని సమర్థంగా పూర్తి చేయాలని సంస్థ చైర్మన్ రెస్క్యూ సిబ్బందికి సూచించారు.ఎన్జీఆర్ఐ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి భూమి తొలిచే యంత్రాల (గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్)ద్వారా ఐదు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాలలో తవ్వకాన్ని సమర్ధంగా నిర్వహించడం కోసం ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు పురమాయించారు. దీనిలో సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా సమర్థంగా ముందుకు సాగుతున్నాయి.
సొరంగంలోకి వెళ్లి పనుల ప్రత్యక్ష పర్యవేక్షణ..
సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ పనులను సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ స్వయంగా పరిశీలించారు. సంస్థ ఛైర్మన్ తమతో పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఎన్. డి ఆర్.ఎఫ్ కల్నల్ తో కలిసి సింగరేణి ఛైర్మన్ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ వరకు పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలించారు.గ్యాస్ కటింగ్ పనులను దగ్గరగా ఉండి పర్యవేక్షించారు. ట్రాకు పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బి.ఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణలో సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ తోపాటు జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలుపెరగకుండా, అంకితభావంతో రెస్క్యూ సేవలందిస్తున్న సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు. ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు