ఆ ప్రమాదం… విషాదాంతం..
SLBC Tunnel Incident: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC) ప్రమాదం విషాదాంతంగా ముగిసింది. వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్ చేశారు. దీంతో.. టన్నెల్‌లోని బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడర్ (GPR) టెక్నాలజీతో కార్మికుల జాడ కోసం టన్నెల్లో స్కానింగ్ నిర్వహించారు. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని సొరంగం లోపలికి పంపించగా.. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి దిబ్బల కింద పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో మృతదేహాలు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి మృతదేహాలను బయటికి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో పైకప్పు కూలిన సమయంలో మట్టి దిబ్బలు వారిపైనే పడి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. 8 మందిలో ఏ ఒక్కరూ మిగలకుండా ప్రాణాలు వదిలారని చెబుతున్నారు. 8 మందిలో.. ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో పనులు నిర్వహిస్తుండగా గత శనివారం ఉదయం సొరంగం పైకప్పు కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం సమయంలో యాబై మంది వరకు కార్మికులు అందులో పనిచేస్తుండగా.. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో గురుప్రీత్ సింగ్, సన్నీ సింగ్, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహూ, అనుజ్ సాహూ, సంతోశ్ సాహూ, జక్తాజస్ అనే ఎనిమిది మంది టన్నెల్ లోనే చిక్కుకని పోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు వారం రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.