బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ర్యాగింగ్
Ragging : ర్యాగింగ్ భూతాన్ని తరిమేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అది మాత్రం మారడం లేదు. కేసులు నమోదు చేసినా, చివరకు విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల నుంచి బహిష్కరించినా ర్యాగింగ్ మానడం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సిగరేట్ తాగాలంటూ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఇంటర్మీడియెట్ ర్యాగింగ్ చేశారు. బట్టలు విప్పి మరీ హింసించారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడని మరో విద్యార్థిపై సైతం దాడికి ఒడిగట్టారు.
బెల్లంపల్లి(Bellampalli) పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో చక్రధర్ అనే విద్యార్థి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. అయితే, ఆ విద్యార్థిని సిగరేట్ తాగాలంటూ కొందరు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒత్తిడి చేశాడు. అతను సిగరేట్ తాగకపోవడంతో విద్యార్థిని బట్టలు విప్పి మరీ ర్యాగింగ్ చేసి హింసించారు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి పదవ తరగతి విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దానిని సైతం మనసులో పెట్టుకున్న సీనియర్లు నిఖిల్‌ను సైతం చితకబాదారు.
ఈ వ్యవహారం కాస్త బయటకు రావడంతో విద్యార్థి నిఖిల్, చక్రధర్ తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీస్తున్నారు.