నీటి సరఫరాపై నిర్లక్ష్యమేల..?
Madaram Town Ship: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం టౌన్షిప్లో మంచినీటి సరఫరాపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాలుగైదు నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ గ్రామానికి నీటి సరఫరా నిర్లక్ష్యంపై కైరిగూడ, గోలేటి దారిపై ధర్నా చేపట్టారు. వంద మంది వరకు మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధికారులు నీటి సరఫరా విషయంలో ఏ మాత్రం పట్టింపులేని విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న నేతలు, యూనియన్ నాయకులు సైతం పట్టించుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడ నుంచి కదలబోమని భీష్మించుకున్నారు.
దీంతో అక్కడికి చేరుకున్న బెల్లంపల్లి ఏరియా ఎస్వో టూ జీఎం రాజమల్లు ప్రజలను శాంతింపచేశారు. నీటి ఎద్దడి నిజమేనని ఒప్పుకున్నారు. తాము కొత్త మోటార్లు తీసుకువచ్చినా సాంకేతిక సమస్యతో వాటిని అక్కడ బిగించలేకపోతున్నట్లు చెప్పారు. వాటర్ ట్యాంకర్లు తీసుకువచ్చి ఫిల్టర్‌బెడ్ నింపి అక్కడ నుంచి నీటి సరఫరా చేస్తామని అన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆందోళన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాద్యక్షుడు పేరం శ్రీనివాస్, కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రకాష్‌రావు, కేంద్ర కమిటీ కార్యదర్శి రామారావు, ఏరియా సెక్రటరీ జీపీ చంద్రకుమార్, రఘునాథ్ రెడ్డి, బాపురెడ్డి, ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిలి, పట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.