గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం.. పేలుడు పదార్థాల వినియోగం..
Nambala Kesava Rao alias Basavaraj ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టుల కంపెనీ-7 (coy7) యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
LTTE ఆధ్వర్యంలో శిక్షణ..
నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ప్రకాష్ అలియాస్ కృష్ణ అలియాస్ దారపు నరసింహ రెడ్డి.. ఈ పేరు వింటే చాలు పోలీసులు ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఆయన సామాన్యమైన మావోయిస్టు కాదు.. కరుడుగట్టిన ఉద్యమ నేత. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. ఐఈడీల వినియోగంలోనూ ఆయన నిపుణుడు. తూర్పు గోదావరి, విశాఖపట్నం ప్రాంతంలో మొదటి కమాండర్ ఆయన. కేశవరావు, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డితో కలిసి 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణల్లో పాల్గొన్నారు. ఆకస్మిక దాడుల వ్యూహాలు, పేలుడు పదార్థాల నిర్వహణలో శిక్షణ పొందారు.
దాడికి స్కెచ్ వేస్తే…
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక కూడా అతను ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల కేశవరావు ఉన్నాడు. 2010లో దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు మరణించారు. ఈ దాడితో పాటు జీరామ్ ఘాటి దాడిలో మాజీ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీగఢ్ కాంగ్రెస్ నాయకుడు నంద్ కుమార్ పటేల్ సహా 27 మంది మరణించారు. ఈ దాడుల వెనక నంబాల కేశవరావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి శరవేశ్వర్ రావు హత్యకు కూడా ఆయనే కారణం. 1992లో పీపుల్స్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ విలీనం తర్వాత ఆయనను పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించింది. 2018 నవంబర్ 10న, రావు గణపతి స్థానంలో మావోయిస్ట్ పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
కోటిన్నర రివార్డు..
నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి ఎన్ఐటీ)లో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) మరియు RSS విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అనే రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆయనను ఒక్కసారి అరెస్టు చేశారు. కేశవరావుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.