కేసీఆర్కు కవిత సంచలన లేఖ
KCR, Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ ఆ లేఖలో పలు అంశాలు పొందుపరిచారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు లేఖ రాసిన కవిత.. ఉర్దూ, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం బాధాకరమన్నారు. బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారని తండ్రికి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మీటింగ్ బాధ్యతలను పాత ఇన్ఛార్జిలకే అప్పగించడంతో తెలంగాణ ఉద్యమ కారులకు సదుపాయాలు కల్పించలేదని చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. పాత ఇంచార్జ్ ల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఫామ్ లు ఇస్తారన్న ప్రచారం సాగుతోందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ మాత్రమే బీ ఫామ్ ఇవ్వాలని సూచించారు కవిత.
2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంఎల్ఏ స్థాయి లీడర్లు మీతో యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారని వెల్లడించారు. కేవలం కొంత మందిని మాత్రమే కలుస్తున్నారని ఫీల్ అవుతున్నారన్నారు. దయచేసి అందరినీ కలవాలని కోరారు కవిత. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై సిల్వర్ జూబ్లీ సభలో కూడా క్లారిటీ ఇవ్వలేదన్నారు. బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందన్నారు కవిత. తాను సఫర్ అయ్యాను కదా.. బహుశా అందుకని కావొచ్చు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.